- వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి..
జూన్ 28 న (ఆదివారం) నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో జూన్ 28 న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తో కలిసి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. పల్స్ పోలియో వ్యాధి దేశంలో చాలా సంవత్సరాల క్రితమే నిర్మూలన అయినప్పటికీ, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చే వలసదారుల కారణంగా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పోలియో చుక్కలు వేయించడం వల్ల ఎలాంటి హాని ఉండదని .. జిల్లాలో గుర్తించిన 46,150 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి 343 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి, దాదాపు 1300 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.


తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని .. అలాగే ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు అందరూ సహకరించి, భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు, నర్సింగ్ విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
