- జవహర్ నగర్ బాలాజీ నగర్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు:
- చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలు రోజురోజుకూ యథేచ్ఛగా సాగుతున్నాయి. మున్సిపల్ రెవేన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతూ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున భవనాలను నిర్మిస్తుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పాఠశాల ముందే అక్రమ కట్టడం
ముఖ్యంగా బాలాజీ నగర్ లోని గవర్నమెంట్ హై స్కూల్ కాంపౌండ్ వాల్‌కు సరిగ్గా ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా ఒక అక్రమ బిల్డింగ్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. పాఠశాల పరిసరాల్లో ఇలాంటి భారీ నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అలాగే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని అధికారులు.. పెరిగిపోతున్న ఆక్రమణలు
నిబంధనల ప్రకారం మున్సిపల్ రెవేన్యూ అనుమతులు, ప్లాన్ లేకుండా ఎలాంటి శాశ్వత కట్టడాలు చేపట్టకూడదనే నియమం ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం నిర్మాణదారులు ఇవేవీ పట్టించుకోకుండా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ అధికారులకు సమాచారం ఉన్నా, వారు ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మౌనం అక్రమార్కులకు మరింత ఊతాన్ని ఇస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తక్షణమే కూల్చివేతలు చేపట్టాలి
ప్రభుత్వ పాఠశాల ఎదురుగా జరుగుతున్న అక్రమ బిల్డింగ్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, దానిని కూల్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు, మున్సిపల్ రెవేన్యూ శాఖ వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాలాజీ నగర్లో చట్టవిరుద్ధంగా వెలుస్తున్న అన్ని అక్రమ కట్టడాలపై ‘హైడ్రా’ లేదా మున్సిపల్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో తనిఖీలు చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
