Saturday, June 20, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంKeesara | ఇంటర్నేషనల్ స్కూల్ ముసుగులో మోసమా ?

Keesara | ఇంటర్నేషనల్ స్కూల్ ముసుగులో మోసమా ?

  • అనుమతి లేకుండా సీబీఎస్ఈ పేరు… !
  • స్కూల్ పేరు ఒకటి… అనుమతి మరోటి !
  • విద్యా వ్యాపారంపై వెల్లువెత్తిన ఆరోపణలు..
  • కీసర మండలంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల మాయాజాలం !
  • తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న పాఠశాలలు

కీసర మండలంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విద్యా ప్రమాణాల పేరుతో తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పేరుతో విద్యాశాఖ అనుమతులు తీసుకుని, మరోవైపు “ఇంటర్నేషనల్ స్కూల్” పేరుతో తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా “సీబీఎస్ఈ కరికులం”, “ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్”, “డిజిటల్ క్లాసులు”, “స్మార్ట్ ఎడ్యుకేషన్” వంటి ఆకర్షణీయ పదజాలంతో అడ్మిషన్ల కోసం విస్తృత ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఆయా పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ సీబీఎస్ఈ స్థాయి విద్య అందిస్తున్నామని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలలలో ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే అనుమతి తీసుకుని పదవ తరగతి వరకు బోధిస్తున్నారు.

- Advertisement -

ఇంటర్నేషనల్ ట్యాగ్‌తో అడ్మిషన్ల వేట :

మండలంలోని చీర్యాల్ ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల “ఇంటర్నేషనల్ స్కూల్” పేరుతో ప్రచారం చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందిస్తున్నామని ప్రకటిస్తోందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ పాఠశాలకు సంబంధించి బోర్డు గుర్తింపులపై స్పష్టత లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అలాగే నాగారం ఆర్‌ఎల్ నగర్ సమీపంలోని ఒక పాఠశాల సీబీఎస్ఈ అనుమతులు లేకపోయినా గానీ సీబీఎస్ఈ అనుమతులంటూ తప్పుడు ప్రచారం నిర్వహిస్తుంది.

విద్య పేరుతో వాణిజ్యమా ?

పిల్లల భవిష్యత్తు కోసం మంచి విద్య అందించాలని ఆశించే తల్లిదండ్రుల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని కొందరు యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ ఫీజులు, ప్రత్యేక యూనిఫాంలు, బస్సు ఛార్జీలు, పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ, సరైన మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఆటస్థలాలు, భద్రతా ప్రమాణాలు లేకపోవడం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విద్యాశాఖ చర్యలు ఎప్పుడు..?

ఇలాంటి పాఠశాలలపై జిల్లా, కీసర మండల విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిజమైన అనుమతులు, గుర్తింపులు, బోధనా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కీసర మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్‌, సీబీఎస్ఈ అనుమతులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పాఠశాలలపై ప్రత్యేక కథనాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది

‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News