Thursday, June 18, 2026
Homeబిజినెస్IPO | అతి పెద్ద పబ్లిక్ ఇస్స్యూకు రంగం సిద్ధం..

IPO | అతి పెద్ద పబ్లిక్ ఇస్స్యూకు రంగం సిద్ధం..

  • పబ్లిక్ ఆఫర్ లో రాబోతున్న రిలయన్స్ జియో..
  • ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మదుపరులు..

భారతీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న దేశీయ టెలికాం రంగ దిగ్గజం రిలయన్స్‌ జియో ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) అతి త్వరలోనే రాబోతున్నట్టు సమాచారం. ఏకంగా రూ.38,000 కోట్ల (4 బిలియన్‌ డాలర్లు) నిధుల సమీకరణతో ఈ మెగా ఐపీవో రాబోతుండగా.. నేడో, రేపో దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ వద్ద రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కంపెనీ వర్గాలు దాఖలు చేస్తాయని తెలుస్తున్నది.

కాగా, జియో మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వాటాదారుల 49వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) శుక్రవారం జరుగనున్నది. దీనికి ముందే జియో షేర్ల పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన ప్రక్రియను సెబీ దగ్గరకు అధికారికంగా తీసుకెళ్లాలని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడితే ఈ మెగా ఐపీవో ఇక ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. ఇప్పటికైతే భారతీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా 3.3 బిలియన్‌ డాలర్ల పబ్లిక్‌ ఇష్యూనే ఉన్నది. జియో రాకతో ఈ రికార్డు చెరిగిపోనున్నది.

- Advertisement -

కాగా, జియో సంస్థ విలువ 130-180 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. రిలయన్స్‌ జియో షేర్లను సొంతం చేసుకొనేందుకు అటు విదేశీ, ఇటు దేశీయ మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో మూడో, దేశంలో అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థగా ఉన్న జియోలో పెట్టుబడులు లాభిస్తాయన్న భావన అంతటా వ్యక్తమవుతున్నది మరి.

దేశ జనాభాకు తగ్గట్టుగా టెలికాం వ్యాపారం కూడా విస్తరిస్తుండటం.. జియోకు కలిసొచ్చే అంశమని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జియో ఐపీవోకు భారీ ఆదరణ రావచ్చన్న అంచనాలూ గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. ఇక అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం సంకేతాలతో మార్కెట్లు కూడా తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ ట్రెండ్‌ ఇలాగే ఉంటే జియోతోపాటు మరికొన్ని సంస్థలు కూడా ఐపీవోలతో సందడి చేయవచ్చన్న విశ్లేషణలున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News