Friday, June 12, 2026
Homeఆంధ్రప్రదేశ్Protest | చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది..

Protest | చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది..

  • సూపర్ సిక్స్ అమలు కాకపొవడంపై ప్రజాగ్రహం..
  • ప్రజా తిరుగుబాటు మొదలైంది..
  • రాజమండ్రి సిటీలో విన్నూత్న నిరసన ర్యాలీ..
  • రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ సిప్ నిరసన కార్యక్రమాలు..
  • నిరుద్యోగులు, మహిళలకు వేల కోట్ల బకాయిలు..
  • ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్న ప్రభుత్వం..
  • పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక..

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ, వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్‌లోని దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

సూపర్ సిక్స్ హామీలు మోసపూరిత ప్రచారంగా మారాయి. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు, పేదల కోసం గొప్ప హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని భరత్ రామ్ విమర్శించారు. నిరుద్యోగులకు తొలి సంతకం డీఎస్సీపై చేస్తామని చెప్పి ఇప్పుడు నియామక ప్రక్రియను వివాదాస్పదంగా మార్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం వారిని పూర్తిగా నిరాశపరిచిందన్నారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి నెల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.

- Advertisement -

మహిళలు, యువతకు వేల కోట్ల రూపాయల బకాయిలు :

ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలు, నిరుద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిగా ఉన్నాయని భరత్ రామ్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడటం దారుణమని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు.. మహిళలకు హామీ ఇచ్చిన సాయం అందించలేకపోయారు.. రైతులకు భరోసా కల్పించలేకపోయారు.. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైంది?” అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారా? :

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని భరత్ రామ్ ఆరోపించారు. తన నివాసంలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి వ్యక్తిగత గదుల వరకు తనిఖీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

పోలీసుల తీరుపై న్యాయపోరాటం..:

తన నివాసంలోకి ప్రవేశించిన పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని భరత్ రామ్ హెచ్చరించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సంబంధిత అధికారులపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులేనని, అధికారంలో ఉన్నవారైనా, అధికారులు అయినా న్యాయవ్యవస్థకు జవాబుదారులేనని పేర్కొన్నారు.

ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది..:

ప్రభుత్వం వెంటనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భరత్ రామ్ డిమాండ్ చేశారు.
ప్రజల సమస్యలపై వైయస్ఆర్ సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల గొంతుకగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, వాటిని విస్మరించడం ప్రజల విశ్వాసాన్ని మోసం చేయడమే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఎన్నికల హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి అని మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News