- గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదు..
- 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు..
గత నాలుగు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. ఇక రెండు రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరి, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసారో ఇక్కడ చూద్దాం..నైరుతి రుతుపవనాలు రాబోయే మూడు, నాలుగు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని భాగాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగిలిన భాగాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
నిన్న ఉత్తర కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, దాని పరిసరాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం, మధ్య బంగాళాఖాతం నుండి తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా తీరప్రాంత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1, 5.8 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉన్న ద్రోణితో విలీనమైంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా విదర్భ వరకు ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడి ఉంది.
రాగల 3 రోజుల పాటు వాతావరణంలో భారీ మార్పులు రానున్నాయి . ఈరోజు,రేపు , ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజులలో పెద్దగా మార్పు లేదు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు , రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
