Tuesday, June 9, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంButterfly City | బటర్‌ఫ్లై సిటీ ‘భూ’ భాగోతం..

Butterfly City | బటర్‌ఫ్లై సిటీ ‘భూ’ భాగోతం..

  • నిమ్మకు నీరెత్తినట్లు నిద్రబోతున్న అధికార యంత్రాంగం..
  • రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్న బటర్ ఫ్లై యాజమాన్యం!
  • పేదల అసైన్డ్ భూముల్లో ‘రెడీమిక్స్ ప్లాంట’..
  • చట్టాలు చుట్ట చుట్టేసిన దుర్మార్గం..
  • 30 అడుగుల లోతుకు మైనింగ్ మాఫియా తవ్వకాలు..
  • గొలుసుకట్టు చెరువుల మనుగడకే ముప్పు..
  • తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కడ్తాల్ గ్రామస్థులు

బటర్ ఫ్లై అంటే అందమైన సీతాకోక చిలుక.. అది అందినట్లే అంది పైకెగిరిపోతుంది.. బటర్ ఫ్లై పేరుపెట్టుకున్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రభుత్వ భూములను తానే పైకి ఎగరేసుకుని వెళ్తోంది.. వీరికి చట్టాలు అంటే లెక్కలేదు.. రాజకీయ పలుకుబడితో, డబ్బు బలంతో ఇష్టానుసారం వెంచర్లు వేస్తున్నారు.. పేదల అసైన్డ్ భూముల్లో రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.. దాదాపు 30 అడుగుల లోతుకు మైనింగ్ చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది.. నిబంధనలను చుట్ట చుట్టేసి అటకెక్కించేశారు బటర్ ఫ్లై యాజమాన్యం..

రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండల పరిధిలోని ‘ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ’ వెంచర్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వెంచర్ అభివృద్ధి అనే ముసుగులో ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, పర్యావరణ విధ్వంసం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేతల అండదండలు, రాజకీయ ఒత్తిళ్లతోనే యాజమాన్యం చట్టాలను బేఖాతరు చేస్తూ రెచ్చిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కళ్ళున్నా కబోదుల్లా వ్యవహరిస్తుండటం వెనుక ఉన్న అసలు ‘రహస్యం’ ఏమిటనే ప్రశ్నలు గుప్పుమంటున్నాయి.

- Advertisement -

పేదల భూములపై ‘రెడీమిక్స’ బుల్డోజర్! :

ప్రభుత్వం గతంలో నిరుపేదలకు, దళితులకు జీవనోపాధి కోసం కేటాయించిన అత్యంత పవిత్రమైన అసైన్డ్ భూములను ఈ వెంచర్ యాజమాన్యం అడ్డగోలుగా ఆక్రమించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అసైన్డ్ భూముల్లో ఎలాంటి వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు చేపట్టకూడదనే కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఏకంగా రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది? అన్నది మిస్టరీగా మారింది..

చట్టప్రకారం పీఓటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఎందుకు మౌన ముద్ర దాల్చింది?
పేదల భూములను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారు? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

30 అడుగుల లోతుకు తవ్వకాలు.. :

వెంచర్ చదును పేరుతో ఇక్కడ ఇష్టారాజ్యంగా సాగిన మైనింగ్ దోపిడీ దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం కొంత మేరకే మట్టిని తొలగించాల్సి ఉండగా.. ఇక్కడ ఏకంగా 30 అడుగుల లోతు వరకు భూమాత గర్భాన్ని చీల్చేశారు.

ప్రజల సూటి ప్రశ్నలు :

ఇంత భారీ తవ్వకాలకు మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయా? తవ్వితీసిన వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎక్కడికి తరలించారు? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ‘రాయల్టీ’ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?

భూముల సహజ స్వరూపాన్ని మార్చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి, ఎడారిగా మారే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

గొలుసుకట్టు చెరువుల మెడకు ‘రియల’ ఉరితాడు!

కడ్తాల్ మండల పరిధిలోని వ్యవసాయానికి జీవనాధారమైన గొలుసుకట్టు చెరువులు, కుంటలు, సహజ వాగులను ఈ వెంచర్ మింగేసేలా ప్లాన్ చేసిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షపు నీరు ప్రవహించే సహజ మార్గాలను (నాలా) పూడ్చివేయడం లేదా డైవర్ట్ చేయడం వల్ల రాబోయే వర్షాకాలంలో సమీప గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను సైతం లెక్కచేయకుండా ఆక్రమణలు సాగుతున్నట్లు తెలుస్తోంది. జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం చెరువుల ఆక్రమణలపై ‘హైడ్రా’ వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో.. ఇక్కడ స్థానిక అధికా రులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది మిస్టరీగా మారింది.

అధికారుల మౌనం దేనికోసం..?

ఈ మహా అక్రమాలపై స్థానిక ప్రజలు, సంఘాలు పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా.. అటు రెవెన్యూ, ఇటు మైనింగ్, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లేక కార్పొరేట్ యాజమాన్యం అందించిన ‘మామూళ్ల’ మత్తులో యంత్రాంగం జోగుతోందా? అన్న అనుమానాలు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నాయి.

విచారణ జరపాల్సిందే!

ఈ ‘భూ’ భాగోతంపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని కడ్తాల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంచర్ పరిధిలోని అసైన్డ్ భూముల సరిహద్దులను రీ-సర్వే చేయాలని, అక్రమ మైనింగ్‌పై పెనాల్టీలు విధించాలని, చెరువులను కాపాడాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు.

ఒకవేళ బటర్ ఫ్లై యాజమాన్యం ఎలాంటి తప్పు చేయకుంటే దానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలని, తప్పు చేసి ఉంటే మాత్రం బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేసి బాధ్యులను జైలుకు పంపాలని స్థానికులు ఖరాఖండిగా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంలో కలెక్టర్, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!

- Advertisement -
RELATED ARTICLES

Latest News