- చిలుకల జంటను పంజరంలో బంధించిన సీతాదేవి..
- సీతమ్మవారిని శపించిన చిలుకలు..
మహా తల్లి సీతాదేవి చిన్నతనంలో జరిగిన ఒక ఆసక్తికరమైన వృత్తాంతం, కర్మ సిద్ధాంతం ఎంతటి శక్తిమంతమైనదో మనకు తెలియజేస్తుంది. పద్మపురాణంలో పేర్కొన్ని ఈ కర్మ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పండితులు సూచిస్తుంటారు.
సీతమ్మ చిన్నతనంలో జనక మహారాజు అంతఃపురంలోని తోటలో ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక చిలుకల జంట చేరుకుంది. ఇవి రెండూ వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చాయి. ఆ చిలుకలు భవిష్యత్తులో జరగబోయే రామాయణ కథను వాల్మీకి మహర్షి నోట విన్నాయి. చెట్టుపై కూర్చుని ఆ రామాయణ కథను పాటగా పాడుతున్నాయి. రాముడనే ఒక రాజు అయోధ్యలో జన్మిస్తాడని, ఆయన జనక మహారాజు కుమార్తె సీతమ్మను పెళ్లి చేసుకుంటాడని ఆలపిస్తున్నాయి. ఆ పాటను సీత విన్నది.
చిలుకల నోట తన పేరు వినిపించడంతో సీత ఆశ్చర్యపోయింది. వాటిని ప్రేమగా దగ్గరకు తీసుకుని పూర్తిగా ఆరా తీసింది. దాంతో తాము విన్న విషయాలను చెప్పిన ఆ చిలకలు.. “ఆ సీతవి నువ్వే కాబోలు” అన్నాయి. ఆ మాటలకు ఎంతో సంతోషించిన సీతాదేవి, రాముడు తనను వివాహం చేసుకునేంత వరకు ఆ చిలుకలు తన వద్దే ఉండాలని కోరుకుంది.
అందుకే వాటిని పంజరంలో ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. దానికి చిలకలు ఒప్పుకోలేదు. తాము ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులమని, పంజరంలో బంధిస్తే బతకలేమని వేడుకున్నాయి. అంతేకాదు, ఆడ చిలుక గర్భంతో ఉందని, తమను విడిచిపెట్టాలని మగ చిలుక ఎంత బతిమాలింది. అయినా కూడా సీత వినలేదు.
మగ చిలుకను వదిలేసి, ఆడ చిలుకను మాత్రమే పంజరంలో బంధించింది. తోడు లేకపోవడాన్ని తట్టుకోలేక మగ చిలుక ఎంతో విలపించింది. పంజరంలో ఉన్న ఆడ చిలుక కూడా దుఃఖంలో కూరుకుపోయింది. అలా కొంతకాలానికి తీవ్ర వేదనతో ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలో సీతకు ఒక శాపం ఇచ్చింది.
“గర్భవతినైన నన్ను నా భర్త నుండి వేరు చేసి ఇంత వేదనకు గురి చేశావు కాబట్టి, నువ్వు కూడా గర్భవతిగా ఉన్నప్పుడు నీ భర్తకు దూరమై, దుఃఖాన్ని అనుభవిస్తావు. ఇదే నా శాపం” అని శపించి మరణించింది. ఆడ చిలుక మృతిని తట్టుకోలేక మగ చిలుక కూడా నదిలో పడి ప్రాణాలు విడిచింది. ఆ సమయంలో “నేను మరుజన్మలో రాముడి రాజ్యంలోనే పుట్టి, సీతకు భర్తతో వియోగం కలిగిస్తాను” అని ప్రతిజ్ఞ చేసింది.
