- న్యాయవాదులకు చారిత్రక రక్షణ కవచం..
- తెలంగాణ హైకోర్టు, న్యాయవాది విజయ్ తల్లాడ..
న్యాయవాదులు న్యాయవ్యవస్థకు వెన్నెముక. వారు ఎవరి పక్షాన వాదించినా దోషి అయినా, నిర్దోషి అయినా ఆ వాదన వారి వృత్తి ధర్మం. కానీ ఆ ధర్మాన్ని నిర్వహించే క్రమంలో న్యాయవాదులు దాడులకు, బెదిరింపులకు, అబద్ధపు కేసులకు గురవుతున్నారు. ఈ దుస్థితిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. 5 – 2 – 2026 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం, 2026 అమల్లోకి వచ్చింది.. (Telangana Act No. 16 of 2026) G.O. No. 41 ద్వారా ఈ చట్టాన్ని అధికారికంగా నోటిఫై చేసింది.
ఈ చట్టం ఎందుకు వచ్చింది?
2021లో న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, నాగమణి హత్యతో మొదలుకొని, ఇటీవలి సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య వరకు తెలంగాణలో న్యాయవాదులపై పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, హైకోర్టు బార్ అసోసియేషన్, జిల్లా బార్ అసోసియేషన్లు – అన్నీ కలిసి ఎన్నో సంవత్సరాలుగా ఈ చట్టం కోసం డిమాండ్ చేస్తూ వచ్చాయి. కర్నాటక, రాజస్థాన్ తర్వాత, ఇలాంటి చట్టం అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరింది. ఇది న్యాయవాద వర్గానికి ఎన్నాళ్ళో ఆకాంక్ష – ఈ రోజు నెరవేరింది.
“హింస” అంటే ఏమిటి – చట్టం ఏం చెబుతోంది?
ఈ చట్టంలో “హింసాత్మక చర్య” అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఇవ్వబడింది. కేవలం శారీరక దాడి మాత్రమే కాదు – ఈ కింది చర్యలన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి :
న్యాయవాదిపై వేధింపు, బలవంతం లేదా శారీరక దాడి
క్రిమినల్ బెదిరింపు, ప్రాణ హాని
కుటుంబ సభ్యులపై దాడి లేదా బెదిరింపు
దురుద్దేశ్యంతో అబద్ధపు కేసులు పెట్టడం
న్యాయవాది రహస్య సమాచారాన్ని బలవంతంగా వెల్లడించేలా ఒత్తిడి చేయడం
న్యాయ వ్యవహారాల నిర్వహణలో భయం కలిగించి జోక్యం చేసుకోవడం
అంటే ఒక న్యాయవాది ఒక కేసులో వాదించాడు కదా అని, ఆ కేసులో ఓడిన వ్యక్తి వారిపై పగ తీర్చుకొనే ప్రతి పద్ధతీ ఈ చట్టం కింద నేరమే.
మొదటిసారి నేరం : 6 నెలలు – 3 సంవత్స లు రూ. 25,000 – రూ 50,000 జరిమానా..
నేరానికి యత్నం : పై శిక్షలో సగం పై జరిమాలో సగం
పునరావృత నేరస్తులు : గరిష్ఠంగా 7 సంవత్స లు గరిష్ఠంగా 1 లక్ష జరిమానా..
చట్టం దుర్వినియోగం ( న్యాయవాది చేస్తే ) గరిష్ఠంగా 3 సంవత్స లు గరిష్ఠంగా రూ. 25,000 జరిమానా ప్లస్ పరిహారం
భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద లేదా తెలంగాణ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ ద్వారా నష్టపరిహారం పొందే హక్కు కూడా కలిగి ఉంటారు.
న్యాయవాదులు తప్పక తెలుసుకోవలసిన హెచ్చరిక – చట్టం దుర్వినియోగం చేస్తే?
ఈ చట్టంలో అత్యంత ముఖ్యమైన అంశం ఒకటి ఉంది – దానిని ప్రతి న్యాయవాది జాగ్రత్తగా చదవాలి.
చట్టాన్ని దుర్వినియోగం చేసే న్యాయవాదులకు కూడా శిక్ష ఉంది. వాడుకుంటే ఒక న్యాయవాది ఈ చట్టాన్ని అబద్ధపు ఫిర్యాదు చేయడానికి, లేదా ప్రత్యర్థిని వేధించడానికి దురుద్దేశ్యంతో 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి. పైగా, పీడితులకు కోర్టు నిర్ణయించిన పరిహారాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది.
చట్టం మనకు రక్షణ ఇస్తుంది.. దాన్ని ఆయుధంగా దుర్వినియోగం చేస్తే మనమే శిక్షకు అర్హులవుతాం. కత్తి రెండువైపులా పదునుగా ఉంది.
ఇంకా ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి?
పోలీస్ రక్షణ : న్యాయవాది ఫిర్యాదు చేస్తే పోలీసులు తగిన రక్షణ కల్పించవచ్చు.
గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం : అన్ని స్థాయిలలో న్యాయవాదుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయబడుతుంది. అబద్ధపు కేసులు, కుట్రల నుండి రక్షణ : వృత్తి విధులు నిర్వహించినందుకు మోపబడే దురుద్దేశ్య కేసుల నుండి న్యాయవాదులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
అంతర్జాతీయ గుర్తింపు :
1990లో హవానాలో జరిగిన 8వ ఐక్యరాజ్యసమితి నేర నివారణ కాంగ్రెస్ లో ఆమోదించిన “న్యాయవాదుల పాత్రపై మౌలిక సూత్రాలు” ఈ చట్టానికి ఆధారభూమి. ఆ సూత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి – న్యాయవాదులు భయం లేకుండా, ఆటంకం లేకుండా తమ వృత్తి విధులు నిర్వహించే హక్కు కలిగి ఉంటారు.. వారి భద్రత ప్రమాదంలో పడినప్పుడు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం ఆ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించింది.
న్యాయవాది భయం లేకుండా వాదించగలిగినప్పుడే న్యాయం నిర్భయంగా జరుగుతుంది. న్యాయవాదిపై దాడి అంటే న్యాయవ్యవస్థపైనే దాడి. తెలంగాణ అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ చట్టం, 2026 − ఆ నిర్భయత్వాన్ని చట్టపరంగా నిర్ధారిస్తున్న చారిత్రక అడుగు. ప్రతి న్యాయవాదీ ఈ చట్టంలోని నిబంధనలు, హక్కులు, జాగ్రత్తలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి అప్పుడే ఈ చట్టం పూర్తి ప్రయోజనం కలుగుతుంది.
