- ప్రకటించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు..
- జూన్ 13, 14, 16 నుంచి 20 వరకు నిర్వహణ..
ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో సీబీటీ 1 పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మారిన తేదీలను తాజాగా విడుదల చేసింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ పరీక్షలు మే 7, 8, 9 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక రెండో విడత పరీక్షలు జూన్ 13, 14, జూన్ 16 నుంచి 20 వరకు జరగనున్నాయి.
అయితే రెండో విడత పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు ఆర్ఆర్బీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తాజా పరీక్షల షెడ్యూల్ ప్రకారం జూన్ 13, 14, 15, 16 నుంచి 20 వరకు మధ్యలో గ్యాప్ లేకుండా వరుసగా పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఆయా తేదీల్లో పరీక్షకు నాలుగు రోజుల ముందు అభ్యర్ధులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పరీక్షకు పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది.
కాగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ 2026 నోటిఫికేషన్ కింద వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో మొత్తం 3,058 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2,424, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 163, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 77 వరకు భర్తీ చేయనున్నారు. సీబీటీ 1, సీబీటీ 2 రాత పరీక్షలు, కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
