Sunday, May 31, 2026
Homeఆదిలాబాద్Sand Mafia | జోరుగా అక్రమ ఇసుక మాఫియా దందా ..

Sand Mafia | జోరుగా అక్రమ ఇసుక మాఫియా దందా ..

  • గతంలో ప్రాణాలు కోల్పోయినా మారని పరిస్థితి
  • సిద్ధాపూర్ బ్రిడ్జి వద్ద యంత్రాలతో బహిరంగంగా తవ్వకాలు
  • హైవేపై దర్జాగా ఇసుక రవాణా…
  • అధికారుల మౌనం పై ప్రజల ఆగ్రహం

నిర్మల్ జిల్లా పరిధిలోని సిద్ధాపూర్ బ్రిడ్జి సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఇసుక తవ్వకాల సమయంలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగినప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి గట్టి చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి యంత్రాల సహాయంతో బహిరంగంగా ఇసుకను తవ్వుతూ, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సిద్ధాపూర్ బ్రిడ్జి వద్ద నది పరివాహక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు భారీగా ఇసుకను తవ్వుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ట్రాక్టర్లు, యంత్రాలు అక్కడికి చేరుకుని నిరంతరంగా ఇసుకను లోడ్ చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాల కారణంగా నది గర్భం ప్రమాదకరంగా మారుతోందని, వర్షాకాలంలో ఇది మరింత ముప్పుకు దారి తీసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

హైవేపై కూడా ఎలాంటి భయం లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతున్నా, తనిఖీలు మాత్రం కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా బహిరంగంగానే ఇసుక తరలింపు జరుగుతుండటంతో అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం వాటిల్లుతుండగా, మరోవైపు గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఇప్పటికే ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రాంతంలో మళ్లీ అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News