- అక్రమార్కుల పన్నాగం భగ్నం..
- సర్వే నంబర్ 24లో తిరిగి ప్రభుత్వ బోర్డు ఏర్పాటు!
ఉప్పల్ మండలం, మల్లాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 24లో గల ప్రభుత్వ భూమి కబ్జా యత్నాలపై వచ్చిన కథనాలకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం మెరుపు వేగంతో స్పందించింది. రాత్రికి రాత్రే అక్రమార్కులు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును తొలగించి, ప్రైవేటు బోర్డును నాటిన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం (మే 29, 2026) స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి చేరుకున్నారు.
క్షేత్రస్థాయికి రెవెన్యూ బృందం.. ప్రైవేట్ బోర్డు తొలగింపు! :
భూ అక్రమార్కులు కోర్టు ఆర్డర్ల సాకుతో ఏర్పాటు చేసిన అక్రమ ప్రైవేటు బోర్డును రెవెన్యూ అధికారులు తక్షణమే తొలగించారు. ఆ స్థలం ఖచ్చితంగా ప్రభుత్వ భూమేనని స్పష్టం చేస్తూ, “ హెచ్చరిక.. ఇది ప్రభుత్వ భూమి, అతిక్రమించిన వారు చట్టరీత్యా శిక్షార్హులు.. సర్వే నం: 24, గ్రామం, మీర్పేట్ (మల్లాపూర్), ఉప్పల్ మండలం, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా “ అని స్పష్టంగా రాసి ఉన్న నూతన అధికారిక ప్రభుత్వ హెచ్చరిక బోర్డును అధికారులు స్వయంగా పాతారు.ఈ సందర్భంగా ఉప్పల్ మండలం తహసిల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కాపాడటంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, సర్కారు స్థలాలను కబ్జా చేయాలని చూస్తే ఎంతటి వారిపైనా అయినా కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
స్థానికుల హర్షం..
కలెక్టర్కు కృతజ్ఞతలు :
పత్రికా కథనాలు, సామాజిక కార్యకర్తల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, కోట్లాది రూపాయల విలువైన 4,302 చదరపు గజాల ప్రభుత్వ భూమి ఇతరుల అధీనంలోకి వెళ్ళకుండా అడ్డుకున్న జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ యంత్రాంగానికి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అక్రమార్కుల బెదిరింపులకు భయపడకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు అధికారులు తీసుకున్న ఈ తక్షణ చర్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
