విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలు
- ఫైర్ సర్టిఫికెట్ లేదు.. జీహెచఎంసీ అనుమతులూ లేవన్న ఆరోపణలు
- వేలాది మంది విద్యార్థులకు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీపై ఆందోళన
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధి కల్వంచ ప్రాంతంలో నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థ సెంట్రలైజ్డ్ కిచెన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్యం, విద్యార్థుల భద్రత వంటి అత్యంత కీలక అంశాలను పక్కన పెట్టి, సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే ఈ కేంద్రం కార్యకలాపాలు కొనసాగుతోందని స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు అధికారిక ఫిర్యాదు అందజేయబడింది.
సమా చారం ప్రకారం, వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఈ కేంద్రం నుంచే ఆహారం తయారు చేసి వివిధ విద్యాసంస్థలకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఆహార తయారీ కేంద్రం వద్ద పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా విస్మరించ బడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిచెన్ చుట్టూ అపరిశుభ్ర వాతావరణం, వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం, ఆరోగ్య భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ కిచెన్‌కు జీహెచఎంసీ అనుమతులతో పాటు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ కూడా లేనట్లు ఆరోపణలు రావడం. అగ్నిప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు, సిబ్బంది భద్రతకు అవసరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేకుండా నడిచే ఆహార కేంద్రాలు రేపటి తరానికి ముప్పు. విద్యా సంస్థ అనే పేరుతో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సహించరాని విషయం” అంటూ పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ఈ వ్యవహారంపై వెంటనే సంయుక్త తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచఎంసీ, ఫుడ్ సేఫ్టీ శాఖ, ఆరోగ్య శాఖ, ఫైర్ సేఫ్టీ విభాగాలు కలిసి సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు జీహెచఎంసీ జోనల్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు సంబంధిత ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు అందజేయబడినట్లు సమాచారం. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ అంశంపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
