- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
పచ్చని తెలంగాణలో అశాంతి సృష్టించి, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు భారాస, కాంగ్రెస్ పార్టీలు అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యువతను హింస, విధ్వంసాల వైపు ప్రేరేపించడం ఆయా పార్టీల అసలు స్వరూపానికి నిదర్శనమని బుధవారం ఒక పత్రికా ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
అధికారం కోల్పోయిన అసహనంతోనే..
అధికారం కోల్పోయిన అసహనంతో భారాస నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘మిలిటెంట్ యాక్టివిటీ చేయండి, సింగరేణి భవనాలు తగలబెట్టండి, రైల్వే పట్టాలు ధ్వంసం చేయండి’ అంటూ ఓ భారాస నేత బహిరంగంగా రెచ్చగొట్టడం అత్యంత ప్రమాదకరమన్నారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మితమైన సింగరేణి లాంటి సంస్థలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం జాతి భద్రతకే ముప్పని హెచ్చరించారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ తీరు రాజ్యాంగ వ్యతిరేకం
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే తరహాలో రెచ్చగొట్టే రాజకీయాలకు కేంద్రబిందువుగా మారిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో పాటు పార్లమెంట్, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రసంగాలు చేయడం, ప్రజల్లో అసహనం, అస్థిరత పెంచే విధంగా వ్యవహరించడం ఆయనలో నెలకొన్న నిరాశ, నిస్పృహలకు అద్దంపడుతోందన్నారు.
అభివృద్ధే భాజపా లక్ష్యం
హింస, అరాచకాలను తెలంగాణ సమాజం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఉపాధి, అభివృద్ధి, శాంతిభద్రతలను కోరుకుంటున్నారని, విధ్వంసాలను ప్రోత్సహించే పార్టీలను ఇకనైనా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి, బాధ్యతాయుత రాజకీయాల కోసం భాజపా నిరంతరం కట్టుబడి పనిచేస్తుందని, అశాంతి వైపు నెట్టే ప్రతి ప్రయత్నాన్ని దీటుగా ఎదుర్కొంటుందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు.
