Sunday, May 24, 2026
Homeక్రైమ్ వార్తలుFraud | నకిలీ నోట్ల మాయాజాలం..

Fraud | నకిలీ నోట్ల మాయాజాలం..

  • మోసపోయిన యువకుడు..
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
  • కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఘటన..

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం, ఆగవేలి గ్రామానికి చెందిన వీరేష్‌కు.. సి.బెళగల్ మండలం బాతోలికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు అనే కిలాడీ పరిచయమయ్యాడు. “నా దగ్గర బ్లాక్ మనీ ఉంది. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీటికి నల్ల రంగు పూశారు. నువ్వు లక్ష రూపాయల వైట్ మనీ ఇస్తే, నేను నీకు మూడు లక్షల విలువైన బ్లాక్ మనీ నోట్లు ఇస్తా” అంటూ ఆశ చూపాడు. నమ్మాలా వద్దా అని వీరేష్ ఆలోచిస్తుండగా, వెంకటేశ్వర్లు అసలు విద్య ప్రదర్శించాడు. కొన్ని నల్లటి కాగితాలను తీసి, వీరేష్ కళ్లెదుటే ఓ కెమికల్ ద్రవంలో ముంచాడు. అంతే! క్షణాల్లో ఆ నలుపు రంగు పోయి, కరకరలాడే అసలైన రూ.500 నోట్లు బయటపడ్డాయి. ఆ మాయాజాలం చూసి వీరేష్ కళ్లు బైర్లు కమ్మాయి. ఇది నిజమేనని నమ్మి, వెంటనే తన వద్ద ఉన్న లక్ష రూపాయలను వెంకటేశ్వర్లకు అప్పగించాడు.

వెంకటేశ్వర్లు ఆరు నల్లటి నోట్ల కట్టలను, ఆ కెమికల్ సీసాని వీరేష్ చేతిలో పెట్టి.. “ఇంటికి వెళ్లి ప్రశాంతంగా కెమికల్‌లో ముంచి నోట్లుగా మార్చుకో” అని చెప్పి జారుకున్నాడు. వీరేష్ ఆత్రుతగా ఇంటికెళ్లి కెమికల్ ఉపయోగించి చూశాడు. కట్టల పైన, కింద మాత్రమే కొన్ని నోట్లు మారాయి.. మధ్యలో ఉన్నవన్నీ కేవలం నల్ల రంగు పూసిన తెల్ల కాగితాలే! తాను మోసపోయానని గ్రహించేసరికి చేతులు కాలిపోయాయి. బాధితుడు వీరేష్ వెంటనే క్రిష్ణగిరి పోలీసులను ఆశ్రయించాడు.

- Advertisement -

రంగంలోకి దిగిన పోలీసులు చెరుకులపాడు రోడ్డులోని ఒక రైస్ మిల్లు వద్ద వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.2 లక్షల నగదు, నల్లటి కాగితాల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన వెంకటేశ్వర్లు, సులభంగా డబ్బు సంపాదించాలనే నెపంతో ఈ బ్లాక్ మనీ బురిడీకి తెరలేపినట్లు విచారణలో తేలింది. నిందితుడిని డోన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి గుడ్డి నమ్మకాలతో, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకుంటే చివరకు మిగిలేది జేబు ఖాళీ.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమే!

- Advertisement -
RELATED ARTICLES

Latest News