- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
పేద కుటుంబాల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అందులో భాగంగా, పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మహిళల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలపై పెళ్లి ఖర్చుల భారం తగ్గి, ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కలుగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు సిద్దప్ప, రాజు గౌడ్, రఘు నాయక్, నర్సింహులు, రంగయ్య నాయక్, నాయకులు సుధాకర్ రెడ్డి, సంజీవరెడ్డి, రాంచంద్రయ్య, తులసిరాం నాయక్, రాము, గోవింద్ యాదవ్, మన్యంకొండ నరేందర్, వెంకటేష్ యాదవ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు
