Friday, May 15, 2026
Homeతెలంగాణప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను విజయవంతం చేయండి..!

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను విజయవంతం చేయండి..!

  • శ్రీ శ్రీ కళావేదిక జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్!!

తెలుగు సాహిత్యం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు, తెలుగు వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనింపజేయాలనే మహత్తర సంకల్పంతో, వచ్చే జూన్ 6, 7 తేదీలలో రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలో “7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు” ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ శ్రీ కళావేదిక జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంస్థ “శ్రీ శ్రీ కళావేదిక” ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుండి తెలుగు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళాకారులు, భాషాభిమానులు ఒకే వేదికపై తెలుగు సాహితీ జెండాను ఎగురవేయడం ఈ మహాసభల ప్రత్యేకతగా నిలుస్తుందని తెలిపారు.

- Advertisement -

ఈ మహాసభలలో సాహిత్య విభాగంలో ప్రపంచ కవితోత్సవం, సాహిత్య సదస్సులు, పత్ర సమర్పణలు, పుస్తకావిష్కరణలు, పద్య కవిసమ్మేళనం, బాల కవి సమ్మేళనం, అష్టావధానం వంటి కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయని చెప్పారు. అలాగే సాంస్కృతిక విభాగంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్యాలు, గిరిజన నృత్యాలు, కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, ట్రాక్ సింగింగ్, మిమిక్రీ, ఇంద్రజాల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయని రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్యం, సంస్కృతి, కళారంగాలన్నీ ఒకే వేదికపై సమన్వయంతో నిర్వహించబడనున్నాయని పేర్కొన్నారు.

యువ కళాకారులు, యువ కవులకు ఈ మహాసభల్లో ప్రత్యేక స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సభలను విజయవంతం చేయడానికి సాహిత్యాభిమానులు, కళాకారులు, కవులు, రచయితలు విస్తృతంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. చైతన్య సారస్వత పరిషత్ చైర్మన్, అమలాపురం కిమ్స్ అధినేత మరియు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కె.వి. సత్యనారాయణరాజు (చైతన్యరాజు) సౌజన్యంతో, శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ నేతృత్వంలో సభలు నిర్వహించబడనున్నాయని తెలిపారు.

సభల కన్వీనర్‌గా. శ్రీ శ్రీ కళావేదిక జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి. పార్ధసారధి, కోఆర్డినేటర్‌గా శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం వ్యవహరిస్తున్నారని చెప్పారు. గతంలో అంతర్వేది, తాడేపల్లిగూడెం, తిరుపతి, ఏలూరు, మంచిర్యాల ప్రాంతాల్లో ప్రపంచ తెలుగు సాహిత్య సభలు విజయవంతంగా నిర్వహించిన విషయం విదితమేనని పేర్కొన్నారు.

దేశ విదేశాల నుండి సాహిత్యాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ మహాసభల ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేపడుతున్నట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సుమారు 5000 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నమోదు ప్రక్రియ, అల్పాహారం, భోజన వసతులు తదితర ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ మహాసభల నిర్వహణ కోసం శ్రీ శ్రీ కళావేదిక ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి జిల్లా మరియు ప్రతి రాష్ట్రం నుంచి సమన్వయకర్తలను నియమించినట్లు తెలిపారు. కవులు, కళాకారులు, అతిథుల సౌకర్యాలు, వసతి, మార్గదర్శకత వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి, వారితో నిరంతర అనుసంధానం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఇంకా ఈ మహాసభల్లో కవులుగా, కళాకారులుగా లేదా సమన్వయకర్తలుగా తమ పేర్లు నమోదు చేసుకుని ఈ బ్రహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు నేరుగా తనను గానీ, లేదా సంస్థకు సంబంధించిన కమిటీ సభ్యులను గానీ సంప్రదించవచ్చని గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రతి రిజిస్ట్రేషన్ చేసుకున్న సభ్యులకు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందిస్తున్న ఏకైక సంస్థ తమ శ్రీ శ్రీ కళావేదికేనని ఆయన పేర్కొన్నారు

అలాగే, ఈ మహత్తర కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక సంస్థ తరఫున తనకు అవకాశం కల్పించి, నిరంతరం ప్రోత్సహిస్తున్న శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్, కళారత్న డా. కత్తిమండ ప్రతాప్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News