తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీతో పాటు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం సర్పంచ్ ఎర్రవెల్లి గౌరీశంకర్ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టేకుల సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, సహపాఠ్య కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంతో పాటు రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్, పాలు, రాగి జావ అందించనున్నట్లు వివరించారు.
అదేవిధంగా విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య అందిస్తున్నామని, గత విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులు మండల, జిల్లా స్థాయిల్లో క్రీడల్లో ప్రతిభ కనబరిచి, కొన్ని క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొన్నారని గుర్తుచేశారు.
ఎస్ఎస్సీ–2026 ఫలితాల్లో పాఠశాల 98.55 శాతం ఉత్తీర్ణత సాధించిందని, గ్రామంలోని బడిఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు మంచి సంస్కారం కూడా నేర్పిస్తారని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నార్లకొండ వెంకటేష్, వార్డ్ సభ్యులు గడ్డం రమేష్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలు శ్రీమతి జ్యోతి, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
