- మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన సంక్షేమ హామీలను వెంటనే అమలు చేయాలని, మీడియా స్వేచ్ఛను పరిరక్షించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఎస్.కె. సలీమా, గుమ్మడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బనావత్ రవి నాయక్, మేడ్చల్ నియోజకవర్గ కన్వీనర్ అంబాల విష్ణు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు అందించాలని, జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీలు కల్పించాలని, ఇండ్ల స్థలాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా, నియోజకవర్గ ఇన్చార్జ్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
