- నా కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది..
- కేసు తరువాత తొలిసారిగా స్పందించిన బండి సంజయ్..
తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారిగా స్పందించారు. తన కుమారుడిని ఒక నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఏ తప్పూ చేయలేదని నా కుమారుడు చెబుతున్నాడు. అతడిని నేను సమర్థించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తా. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తాం” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తన కుమారుడిపై జరుగుతున్న దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోందని, తన భార్య డిప్రెషన్‌లోకి వెళ్తోందని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. రాజకీయ కారణాలతోనే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారని ఆరోపించారు. నేను భయపడుతున్నానని ప్రత్యర్ధులు అనుకుంటున్నారని, నేనెప్పుడూ భయపడనని అన్నారు. కుతంత్రాలు చేసిన వారితో పాటు నా కుటుంబం, నా పార్టీని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని బండి సంజయ్ హెచ్చరించారు.
గత డిసెంబర్ 31న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో భగీరథ్‌పై మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం డీసీపీ రితిరాజ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
