సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు, శుభకార్యాల్లో, ఆలయాల్లో వ్రతాలు, హోమాలు చేసేటప్పుడు కానీ ఆసనం మీద కూర్చోవడం సంప్రదాయం. ఆసనం అంటే కూర్చోడానికి వాడే పీట, చాప లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నేల మీద పరచుకునే వస్త్రాలు వంటివి. హిందూ సంప్రదాయం ప్రకారం దేవుని పూజ కూర్చుని మాత్రమే చేయాలి. నిలుచుని పూజ చేయడం వలన ఆ పూజ ఫలించదు. అందుకే మన సంప్రదాయాల్లో పూజలో ఆసనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పురాణాలలో వివరించిన ప్రకారం పూజలో వాడే ఒక ప్రత్యేకమైన ఆసనం వలన సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయంట! మరి ఆ ఆసనం ఏమిటో చూద్దాం.
పూజ చేసే సాధకుడి శక్తిని భూమ్యాకర్షణ శక్తి కిందకు గుంజుతుందని, అందువల్ల వైదిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నేలపై కూర్చోరాదని శాస్త్రం చెబుతోంది. పూజ చేసేటప్పుడు ఆసనం మీద కూర్చుని మాత్రమే పూజ చేయాలని ధర్మ గ్రంథాల్లో వివరించి ఉంది. మరి ఆ ఆసనం గ్రహ దోషాలు కూడా తొలగించేదైతే మరింత శ్రేష్టం కదా! అలాంటి ఆసనం ఏదైనా ఉందా! అంటే తప్పకుండా ఉంది. ఎన్నో యుగాల క్రితమే మన మహర్షులు తపస్సు చేయడానికి ఉపయోగించిన ఆసనం అన్ని రకాల పూజలకు ఉపయోగించవచ్చు.
దర్భ, లేదా కుశ గడ్డి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన గడ్డి జాతి. యజ్ఞయాగాదులు, పూజలు, పితృకర్మలు, గ్రహణ సమయంలో శుద్ధి కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది శ్రీమహావిష్ణువు శరీర కేశాల నుండి ఉద్భవించిందని పురాణాల నమ్మకం. దర్భలకు అధిక ఉష్ణశక్తిని నిరోధించే సామర్థ్యం, క్రిమిసంహారక శక్తి కూడా ఉంది. పూజా సమయంలో దర్భలతో చేసిన ఆసనం మీద కూర్చుని పూజ చేయడం వలన గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయంట!
