- మే 7… విప్లవ వీరుని వర్ధంతి
విప్లవ వీరుడు అల్లూరి సీతా రామరాజు గురించి తెలియని వారుండరు. మన్యం ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసి, వారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరు డైన అల్లూరి, అక్కడి ప్రజలకు దైవ సమానుడై, భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడుగా, మన్యం వీరుడుగా, అగ్గి పిడుగుగా ప్రసిద్ది గాంచిన పోరాట యోధుడు సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి.
ఆయన ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరు లతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకులేకుండా చేసిన సీతారామరాజు.. తనను నమ్ముకు న్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడు.
సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4.. హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి – 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం. వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు ,అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు.

అయితే పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు.
1917లో విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు.
రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవీ పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్స వాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతి ష్యం, వాస్తు శాస్త్రం, హఠ యోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పాడు.
చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాల పట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంత కాలం తపస్సు చేశాడు.
1916 ఏప్రిల్ 26 న ఉత్తర భారతదేశ యాత్రకు బయలు దేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు.
కాశీలో కొంతకాలం ఉండి సంస్కృత భాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్ సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మ కపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగి వచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంథము, అశ్వ శాస్త్రము, గజ శాస్త్రము, మంత్ర పుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచు కొన్నాడు.

అనేక యుద్ధ విద్యల్లోను, ఆయుర్వేద వైద్య విద్యలోను ప్రావీణ్యుడవటం చేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు క్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసింది.
ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు.
రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది. మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కో వడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధ మైనాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు.
గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మంది దాకా ఆయన అజమాయిషీలో తయార య్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. చింతపల్లి, కృష్ణదేవు పేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, తదితర పోలీస్ స్టేషన్ లను ముట్టడించి ఆయుధాలను తీసుకెళ్లారు.
ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేని రాజు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు.
1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు.
తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరు డయ్యాడు. రామరాజు చనిపోయే ముందు రూథర్ ఫర్డ్ తో సాగిన సంభాషణ ఆయన వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది…

నీలాంటి వీరుడు మా దేశంలో పుట్టి ఉంటే అని రూథర్ఫర్డ్ అన్న సందర్భంలో….”రూథర్ఫర్డ్.. పొరపాటున కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడి మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం. నదులు, కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు.. వేయి జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సముచ్ఛ రణకే పాటుపడతాను”.
స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు. పోరాడి గెలుచుకునే హక్కు. రక్తమాంసాలు దారబోసి రక్షించుకోవాల్సిన వరం. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి చావులేదో, ఎక్కడ ప్రతి మనిషి తల ఎత్తుకొని తిరగగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొళ్లగొట్టరో, ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని రామరాజ్యాన్ని నేను కోరు తున్నాను.
నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడుకట్టింది. మీ పాలనపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారం అంతమ య్యేంతవరకు, ఆఖరి తలప్రాణి ఈ గడ్డ వదలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే..
ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం.
