- సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగ లేఖ..
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని అన్నారు. సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరని ఆయన హెచ్చరించారు.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చారని కేటీఆర్ తన లేఖలో తీవ్రస్థాయిలో విమర్శించారు. “ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ. దీనివల్ల 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇది నిరుపేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే వెన్నుపోటు చర్య” అని కేటీఆర్ అభివర్ణించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కొనసాగించిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకానికి గ్రహణం పట్టిందని విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా సుమారు 10 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను చెల్లించలేదని, ఇప్పుడు విద్యార్థుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తామంటే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో 2500కు పైగా కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. నిధులు అడిగిన వారిని వన్-టైమ్ సెటిల్మెంట్, టోకెన్ల పేరుతో మభ్యపెట్టారని, నిరసన తెలిపితే విజిలెన్స్ దాడులతో బెదిరించారని ఆరోపించారు.
