- నితీష్ కుమార్ ని రాజకీయంగా మట్టుబెట్టారు..
- సీన్ పదవిని వదులుకునేలా చేశారు..
బీహార్‌లోని అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. సుమారు రెండు దశాబ్దాల పాటు నితీశ్ కుమార్ నిర్వహించిన సీఎం పదవిని వదులుకునేలా ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ ఆయనను రాజకీయంగా సమాప్తం చేసిందని ఆరోపించారు. బీజేపీకి చెందిన సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు శుక్రవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సామ్రాట్ చౌదరికి అభినందనలు తెలిపారు. కాగా, బీజేపీతో పాటు ఎన్డీయే మిత్రపక్షమైన జేడీ(యూ)పై తేజస్వీ యాదవ్ విమర్శలు గుప్పించారు. ‘నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగేందుకు బీజేపీ అనుమతించదని మాకు ముందే తెలుసు. 2030 వరకు ఎన్డీయే కూటమి నేతగా నితీశ్ కుమార్ ఉంటారని బీజేపీ పదే పదే చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు వారు ఆయనను పూర్తిగా రాజకీయంగా అంతం చేశారు’ అని అన్నారు.
మరోవైపు బీహార్‌లో రాజకీయ వాతావరణం అస్థిరంగా మారిందని, ఐదేళ్లలో ఐదు ప్రభుత్వాలు మారాయని తేజస్వీ యాదవ్ విమర్శించారు. అలాగే నాయకత్వం చేతులు మారిన తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. ‘ఎన్నికైన ముఖ్యమంత్రిని, ఎంపికైన ముఖ్యమంత్రి తొలగించారు’ అని ఎద్దేవా చేశారు.
