Tuesday, April 21, 2026
Homeనల్లగొండInspection | పాఠశాలల్లో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై కఠిన నిఘా…

Inspection | పాఠశాలల్లో పారిశుద్ధ్యం, భోజన నాణ్యతపై కఠిన నిఘా…

  • ఆకస్మిక తనిఖీలతో అలర్ట్ చేసిన కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ పడబోమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ చేపట్టారు.

ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన కలెక్టర్, వంటశాలను తనిఖీ చేసి వంట విధానం, ఆహార తయారీ ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, పోషకాహారంతో, రుచికరంగా ఉండేలా చూసుకోవాలని వంట సిబ్బందికి సూచించారు. వంటకు వినియోగించే సరుకుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రమాణాలకు అనుగుణంగా ఉండే పదార్థాలనే వినియోగించాలని ఆదేశించారు.

- Advertisement -

అనంతరం పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించిన ఆయన, పరిశుభ్రతను ఎప్పటికప్పుడు కచ్చితంగా పాటించాలని, వసతి గృహాలు, వంటగదులు పరిశుభ్రంగా ఉండేలా బాధ్యులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తరగతి గదులను సందర్శించిన కలెక్టర్, ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఏ–2 పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా, సక్రమ వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చూడాలని చెప్పారు.

ఇక పాఠశాలలో కొనసాగుతున్న మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి, పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు సౌకర్యవంతమైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

“విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేస్తేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి” అని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో డీసీఓ/ప్రిన్సిపల్ శ్రీనివాస్, సహాయ వార్డెన్ సైదయ్య, హెడ్ సూపర్వైజర్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News