- వైద్యాధికారి నరేష్..
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయని, వేసవి తాపం కూడా పెరుగుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వడదెబ్బపై అవగాహన పెంచుకోవాలని మండల వైద్యాధికారి నరేష్ కోరారు. గరిడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ వడదెబ్బ పై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వడదెబ్బ లక్షణాలను వివరిస్తూ వడదెబ్బ సోకిన వ్యక్తికి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అవడం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అధిక చెమటలు పోయటం, చెమట పూర్తిగా లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు.
ఇటువంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని ఆయన కోరారు. వడదెబ్బను నివారించాలంటే ప్రతి రోజు ఎక్కువగా నీరు తాగాలని, నిమ్మరసం, మజ్జిగ లాంటిది తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృశ్య ప్రతి ఒక్కరు బయట పనులను ఉదయం 12 గంటల లోపు ముగించుకోవడం మంచిదన్నారు.
సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గొడుగు, టోపీ, చేతి రుమాలు లాంటివి తలపై ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు పలుచని కాటన్ దుస్తులను ధరించాలని కోరారు. గ్రామాలలో ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుత ఎండ తీవ్రత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఎండలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
