- చట్టం అధికార పార్టీ నేతలకు ఒకలా.. సామాన్యులకు మరోలా ఉంటుందా..?
- ఇదేనా నేతలు చెబుతున్న ప్రజాప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వంలో పైరవీ కారులదే హవానా ..?
- హస్తం పార్టీ నేతలయితే చాలా..ఎన్ని తప్పులు చేసినా..క్షమిస్తారా ఎమ్మెల్యే గారు..
- నాకెందుకు భయం తప్పు చేస్తే కాపాడేందుకు మా ఎమ్మెల్యే ఉన్నాడుగా..?
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ విజయలక్ష్మిపై నెలల తరబడి విధులకు గైర్హాజరు అవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈమె అధికారిక విధులను విస్మరించి, ప్రైవేటు వైద్యశాలల కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారనే విమర్శలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లా వైద్యాధికారులు శాఖాపరమైన చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.. డాక్టర్ విజయలక్ష్మిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని షాద్నగర్ ఎమ్మెల్యే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “చట్టం అధికార పార్టీ నేతలకు ఒకలా, సామాన్యులకు మరోలా ఉంటుందా?” అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రభుత్వం పేరుతో నడుస్తున్న పాలనలో పైరవీదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
సామాన్యులు చిన్న తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకునే వ్యవస్థ ఉన్నప్పటికీ, నెలల తరబడి విధులకు హాజరు కాకపోయిన అధికారిపై చర్యలు తీసుకోవడాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటువంటి ఘటనలు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిని పక్కనపెట్టి ప్రైవేటు వ్యాపారాల్లో బిజీ :
షాద్ నగర్ వైద్యాధికారిపై లెక్కలేనన్ని ఆరోపణలు :
షాద్ నగర్ పరిధిలోని ఆరు మండలాలకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న ప్రభుత్వ దవాఖానకు ప్రతిరోజూ వందలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. దాదాపు 20 మంది డాక్టర్లు, 30 మంది సిబ్బందితో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ఆసుపత్రిలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన వైద్యాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి విధులకు గైర్హాజరు కావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. విధులను పక్కనపెట్టి వ్యక్తిగత పనుల్లో ఆమె ఎప్పుడు బిజీగా గడుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, షాద్ నగర్ లో డాక్టర్ విజయలక్ష్మి ఒక ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహించడమే కాకుండా, ఇటీవల “శారద ఫర్టిలిటీ సెంటర” పేరుతో మరో ప్రైవేటు కేంద్రాన్ని ప్రారంభించి, దాని పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.. ఈ అంశం వెలుగులోకి రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బాధ్యతలను విస్మరించి ప్రైవేటు వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది.

ఆదాబ్ కథనంతో విషయం వెలుగులోకి..:
ఈ అంశం “ఆదాబ్ కథనంతో” వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. నిజానికి షాద్ నగర్ వైద్యాధికారినిపై వచ్చిన… వస్తున్న… ఆరోపణలు మొదటివి కాదు ..ఈమెపై ఇప్పటికే ఉన్నతాధికారులకు చాలా పిర్యాదు అందాయి.. అయినా ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నాడంటూ చెప్పుకుని ఈమె తన వ్యవహారాలను చక్కపెట్టుకుంటుంది..ఈ నేపథ్యంలో వైద్యాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి తన సన్నిహితులతో మాట్లాడుతూ “నాకు ఎలాంటి భయం లేదు,ఉండదు ..
అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాను” అని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఇదే సమయంలో, ఆమెపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకూడదని షాద్ నగర్ ఎమ్మెల్యే అధికారులకు సూచించినట్లు ఆరోపణలు రావడం ఈ వివాదాన్ని మరింత ముదిర్చింది.
ప్రభుత్వ విధులను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులే వారిని వెనుకేసుకురావడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. “ఇది ప్రభుత్వ సేవనా, లేక రాజకీయ కార్యకలాపాలా?” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల వల్ల నియోజకవర్గంలో కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక ఇతర ప్రాంతాలకు బదిలీలు కోరుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నాయకులు తమ ప్రభావాన్ని ఉపయోగిస్తూ వివిధ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
