Monday, March 30, 2026
Homeక్రైమ్ వార్తలుCyber Scam | హైకోర్టు న్యాయమూర్తిని మోసగించిన కేటుగాడు..

Cyber Scam | హైకోర్టు న్యాయమూర్తిని మోసగించిన కేటుగాడు..

  • ముంబైలో వెలుగు చూసిన ఘటన..

ఒక హైకోర్టు న్యాయమూర్తి, సైబర్‌ నేరగాడి ట్రాప్‌లో పడ్డారు. ఆ జడ్జికి ఒక లింక్‌ పంపిన అతడు రూ.6 లక్షల మేర ఆయనను మోసగించాడు. న్యాయమూర్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు నిందితుడ్ని గుర్తించి అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 28న బాంబే హైకోర్టు న్యాయమూర్తి తన క్రెడిట్ కార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకునేందుకు ప్రయత్నించారు.

ఆ బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించగా బిజీ వల్ల లైన్‌ కలవలేదు. కాగా, ఆ న్యాయమూర్తి బ్యాంక్‌ కస్టమర్ కేర్ నంబర్ కోసం ఇంటర్నెట్‌లో వెతికారు. ఒక నకిలీ నంబర్‌కు ఆయన కాల్‌ చేశారు. జడ్జితో మాట్లాడిన సైబర్‌ మోసగాడు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించాడు. ఆయనకు ఒక లింక్‌ను పంపి యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు.

- Advertisement -

మరోవైపు ఆ న్యాయమూర్తి తన ఐఫోన్‌లో ఆ యాప్ డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో ఆండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆ నకిలీ టెలీకాలర్ సూచించాడు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తన సిమ్ కార్డును ఇంటి పనిమనిషి ఆండ్రాయిడ్ ఫోన్‌లో వేసి ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ యాప్‌లో తన క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేసిన వెంటనే ఆయన ఖాతా నుంచి రూ. 6.02 లక్షలు విత్‌ డ్రా అయ్యాయి.

కాగా, మోసపోయినట్లు గ్రహించిన ఆ బాంబే హైకోర్టు జడ్జి వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కఫ్ పరేడ్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జార్ఖండ్‌లోని జామ్తారాలో నివసించే 25 ఏళ్ల మజార్ ఆలం ఇస్రాయిల్ మియాన్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. జార్ఖండ్‌లోని జామ్తారా సైబర్ సెల్, కర్మతాండ్ పోలీసుల సహాయంతో పది రోజుల్లోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. 10 రాష్ట్రాల్లో జరిగిన 36 సైబర్ మోసాల కేసులతో నిందితుడికి సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్‌ అధికారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News