- బోడుప్పల్ ‘సిద్ధార్థ’ పాఠశాల వద్ద ఆందోళన
బోడుప్పల్: సీబీఎస్ఈ (CBSE) నిబంధనలకు, తెలంగాణ ప్రభుత్వ ఫీజుల నియంత్రణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బోడుప్పల్ లోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తీరును నిరసిస్తూ సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఎలాంటి సహేతుక కారణం లేకుండా అకస్మాత్తుగా ట్యూషన్ ఫీజులను 15% నుంచి 25% వరకు పెంచేయడమే కాకుండా, అదనంగా ‘యాక్టివిటీ ఫీజుల’ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతూ తమపై ఆర్థిక భారం మోపుతున్నారని వారు మండిపడ్డారు.
సీబీఎస్ఈ అఫిలియేషన్ బైలాస్ (Affiliation Bye-laws), రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు పెంచడానికి వీల్లేదని, అలాగే పాఠశాల ప్రాంగణాల్లో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ, సిద్ధార్థ యాజమాన్యం ఈ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తూ..

బయట మార్కెట్లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు, యూనిఫాంలను అధిక ధరలకు విక్రయిస్తూ విద్యాసంస్థను వ్యాపార కేంద్రంగా మార్చేసిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీబీఎస్ఈ బోర్డు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకుని పెంచిన ఫీజులను తగ్గించాలని, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై అఫిలియేషన్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
