- మరో ఎల్పీజీ ట్యాంకర్ త్వరలో న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరనున్నది.
దేశంలో గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో మరో ఎల్పీజీ నౌక ‘జగ్ వసంత్’ భారత్ చేరుకున్నది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద 23 రోజుల పాటు ఇది చిక్కుకున్నది. ఇరాన్‌తో భారత్ దౌత్య చర్చల నేపథ్యంలో ఇటీవల హోర్ముజ్ జలసంధిని ఇది దాటింది. 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడ్‌తో ఉన్న ‘జగ్ వసంత్’ ట్యాంకర్ గురువారం రాత్రి గుజరాత్‌లోని పోర్ట్‌కు చేరుకున్నది.
కాగా, 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తున్న ‘పైన్ గ్యాస్’ అనే మరో ఎల్పీజీ ట్యాంకర్ త్వరలో న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరనున్నది. దీని రాకతో దేశంలోని ప్రస్తుత ఎల్పీజీ నిల్వలకు అదనంగా 92,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ చేకూరుతుంది. దేశంలో ఒక రోజు వంటగ్యాస్ వినియోగానికి ఇది సమానం.
మరోవైపు గత పది రోజుల్లో హోర్ముజ్ జలసంధిని దాటిన రెండు పెద్ద ఎల్పీజీ ట్యాంకర్లు ఇప్పటికే భారత్ చేరుకున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో 20 భారత నౌకలు చిక్కుకున్నట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఐదు భారీ ఎల్పీజీ ట్యాంకర్లు ఉన్నట్లు పేర్కొంది. వీటి రాకతో 2,30,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. మరో భారీ ఎల్పీజీ ట్యాంకర్ కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో ఎల్పీజీని నింపుకుని భారత్‌కు బయలుదేరుతుందని వివరించింది.
