- జగదేవపూర్ ఎంపీడీఓ ఆఫీసులో అధికారుల ఇష్టారాజ్యం!
- నెలల తరబడి కార్యాలయం లోపలే వాహనాల పార్కింగ్.
- సామాన్యులకైతే నీతులు.. అధికారులకైతే నిబంధనలు లేవా?
- పట్టించుకోని ఉన్నతాధికారులు..
- ముక్కున వేలేసుకుంటున్న జనం
ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణ నేర్పించాల్సిన అధికారులే దారి తప్పుతున్నారు. జగదేవపూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం (MPDO Office) ఇప్పుడు అస్తవ్యస్త పార్కింగ్‌కు నిలయంగా మారింది. సామాన్యులు తమ అవసరాల కోసం కార్యాలయానికి వచ్చి వాహనాలను ఎక్కడైనా నిలిపితే నీతులు చెప్పే అధికారులు, ఇప్పుడు తమ సొంత వాహనాల విషయంలో మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.

నెలల తరబడి లోపలే తిష్ట:
కార్యాలయం బయట వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం ఉన్నప్పటికీ, కొందరు అధికారులు తమ వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఒక అధికారి కార్యాలయం ఎదుట అడ్డదిడ్డంగా వాహనాన్ని నిలిపితే, మరొకరు ఏకంగా కార్యాలయం లోపలే గత కొన్ని నెలలుగా వాహనాన్ని పార్కింగ్ చేయడం విడ్డూరంగా మారింది. నెలలు గడుస్తున్నా సదరు వాహనం ఎవరిది? ఎందుకు అక్కడ ఉంచారు? అని ఆరా తీసే నాథుడే కరువయ్యారు.
ప్రశ్నిస్తున్న సామాన్యులు:
ప్రతిరోజూ ఎందరో ఉన్నతాధికారులు ఈ కార్యాలయానికి వస్తూ పోతుంటారు. కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా వారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “సామాన్యుల వాహనాలు ఇలా పార్కింగ్ చేస్తే అధికారులు ఊరుకుంటారా? అధికారులకైతే ఒక చట్టం, సామాన్యులకైతే మరో చట్టమా?” అని కార్యాలయానికి వచ్చే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించి, నిబంధనలు పాటించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
