- భవన్కు ఆదాయం సున్నా..!
- ఫీజులన్నీ మింగేస్తున్న రాంబంధు..
- ఏజెన్సీల నుంచి కమీషన్ల దందా..
- ఫోర్జరీ సంతకాలతో వ్యవహారాలు..
సైనిక్పురి భవన్స్ అంటేనే విద్యకు, విలువలకు మారు పేరు. ఎంతో ఉన్నతమైన వ్యక్తులు భవిష్యత్తు తరాన్ని తయారు చేసేందుకు ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఇలాంటి విద్యా వనంలో పీఈటీగా చేరిన పిల్లి రాము (రాం బంధు) కళంకితుడిగా మారాడు. సంస్థను నడిపే ఉన్నతమైన వ్యక్తులు వయోభారం, అనారోగ్య కారణాలే రాంబంధుకు బాగా కలిసొచ్చింది. పందికొక్కుగా మారిన పీఈటీ రాము భవన్స్ ఆదాయాన్ని రకరకాల రూపంలో మింగేస్తున్నాడు.
ఫీజుల రూపంలో వచ్చే సుమారు రూ.60 కోట్లను సైతం వివిధ కాకి లెక్కలతో ఖతం పట్టిస్తున్నారు. సైనికి పురి భవన్స్ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే పనిలో రాంబంధు, మరో మహిళా ఉద్యోగితో కలిసి పనిలో పడ్డాడు. సేవా ట్రస్ట్‌ను చెరబడుతూ భవన్స్‌లో ఈ ఇద్దరు కలిసి దోపిడీ చేస్తున్నారు. పీఈటీ రాము భవన్స్‌లో ఆడిందే ఆట. ఆయన చెప్పిందే వేదం. దీంతో భవన్స్ ఆదాయం గండి పడటంతో పాటు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఏర్పడింది.

ఫీజులను సైతం మింగేస్తున్నారు :
సైనిక్‌పురి భవన్స్‌లో కేజీ నుంచి పీజీ వరకు కోర్సులున్నాయి. స్కూల్‌లోనే సుమారు 5వేల మంది విద్యార్థులున్నారు. వీరే కాకుండా జూనియర్, డిగ్రీ, పీజీ కోర్సులలో సుమారు మరో 5వేల మందికి పైగానే ఉన్నారు. పాఠశాల, కళాశాలలో బోధన సిబ్బంది సుమారు 500లకు పైగానే ఉన్నారు. వీరే కాకుండా బోధనేతర సిబ్బంది సుమారు 250 వరకు ఉన్నారు. పాఠశాల, కళాశాలలలోని విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఏడాదికి సుమారు రూ.60 కోట్ల పైనే ఆదాయం వస్తోంది.

వీటిలో సుమారు రూ.40-50 కోట్ల వరకు వేతనాలు, ఇతర ఖర్చులు అవుతాయి. అంటే ఏడాదికి ఖర్చులు పోను సుమారు రూ.10-20 కోట్ల ఆదాయం ఉంటుంది. గతంలో ఈ మిగిలిన ఆదాయాన్ని పలు బ్యాంకులలో డిపాజిట్ చేసేవారు. కానీ, రాంబంధు చేతిలోకి అధికారం వచ్చాక డిపాజిట్లు చేయడం ఆగిపోయాయనే ఆరోపణలున్నాయి. వచ్చిన కాడికి వివిధ ఖర్చులను చూపిస్తూ మింగేస్తున్నారు. కేవలం బాంబే హెడ్ ఆఫీస్‌కు మాత్రం మొత్తం టర్నోవర్‌లో 5శాతం చెల్లిస్తున్నారు.
అకాడమీల ఫీజుల జేబుల్లోకే..
సైనిక్ పురి భవన్స్‌లో కేజీ నుంచి పీజీ వరకు కోర్సులే కాకుండా భవన్స్ క్రికెట్, టెన్నీస్ అకాడమీలున్నాయి. ఇదే కాకుండా వీటికి అనుబంధంగా హాస్టళ్లు సైతం ఉన్నాయి. క్రికెట్ అకాడమీలో సుమారు 200లకు పైగా విద్యార్థులు ఉంటారు. వీరిలో సగం వరకు హాస్టల్‌లో ఉంటారు. టెన్నీస్ అకాడమీలో సుమారు సుమారు 50 మంది వరకు ఉంటారు. కోచింగ్ కోసం హాస్టల్ లోనూ విద్యార్థులుంటారు. దీనికి ఫీజు ఒక్కరికి ఏడాదికి రూ.3.50 లక్షలు ఉంటుంది. ఇది కాకుండా నెలకు కోచింగ్ ఫీజు రూ.3500 ఫీజు, యూనిఫాంకు రూ.10వేలు, ఇతర రకరకాల రూపంలో పిల్లల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు.

కేవలం ఈ రెండు అకాడమీల నుంచి నెలకు సుమారు రూ.7 లక్షలకు పైగానే ఫీజులు వస్తాయి. విద్యార్థులు చెల్లించే ఫీజులు నేరుగా సైనిక్ పురి భవన్స్ అకౌంట్లోకి వేయాలి. కానీ, పిల్లి రాము ఇక్కడ పీఈటీ, పైగా అతడి చేతిలోనే భవన్స్ ఉండటంతో తాను కొంత మంది బినామీలను పెట్టుకున్నాడు. ఈ ఫీజులను తన బినామీ అయినా కోచ్ కృష్ణమోహన్ గూగుల్ లేదా ఫోన్ పేలకు చెల్లించుకుంటున్నారు. ఈ విధంగా సైనిక్ పురి భవన్స్ కు వచ్చే ఆదాయానికి సైతం గండి పెడుతున్నారు.
అకాడమీల నుంచి ఏడాదికి సుమారు రూ.70 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కానీ, అవి అన్నీ ఎటు పోతున్నాయో లెక్కా, పత్రం ఉండటం లేదు. క్రికెట్, టెన్నీస్ అకాడమీలలో పిల్లి రాము దందాకు అడ్డు, అదుపు లేదు. ఇది కాకుండా తను తీసుకునే రూ.2 లక్షలకు పైగా జీతంతో పాటు అకాడమీలను చూస్తున్నందుకు అదనంగా సుమారు రూ.20వేల వరకు తీసుకుంటూ సైనిక్ పురి భవన్స్ ఆదాయాన్ని తన జేబుల్లోకి నింపుకుంటున్నాడు..

రాంబంధుకు కమీషన్ల కక్కుర్తి :
సైనిక్ పురి భవన్స్‌లో ఏ చిన్న పని కాంట్రాక్టు చేయాలన్నా లేదా ఏ చిన్న ఉద్యోగంలో చేరాలన్నా ముందుగా రాంబంధు పిల్లి రామును కలువాల్సిందే. అతడు ఒకే అంటేనే ముందుకు పోవాలి. లేదంటే భవన్స్ గేటు కూడా దాటనివ్వరు. భవన్స్‌లో చేపట్టే ప్రతి నియామకం రాంబంధుతో పాటు మరో మహిళా ఉద్యోగికి తెలియకుండా ఉండదు. అంతా వీరిద్దరే చూసుకుంటారు. భవన్స్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం 5 ప్రైవేటు ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు. వీరి ద్వారానే సుమారు 200 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు.
వాస్తవానికి భవన్స్ నిబంధనల ప్రకారం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు అనే ఉద్యోగ నియామకాలు చేయకూ డదు. కానీ, రాంబంధు రాజ్యంలో ఇదే కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం గత 4 ఏళ్లుగా మేనేజ్‌మెంట్ కమిటీ లేకపోవడమే. దీంతో రాంబంధు ఇష్టారాజ్యంగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుంటా సంబంధిత ఏజెన్సీల నుంచి ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.. అతడు అడిగినంత ఇవ్వకపోతే ఆ ఉద్యోగులను తొలగిస్తూ, మళ్లీ కొత్త వారిని నియమించుకుంటూ దీనినే పెద్ద దందాగా మార్చుకున్నాడు.
కాగా ఇక్కడ జరుగుతున్న అక్రమ వ్యవహారాలు అన్ని కూడా.. ఈ సైనిక్ పురి భవన్స్ నుంచి అక్రమంగా తొలగించబడ్డ సుమారు 35 మందికి పైగా ఉద్యోగులు ఆధారాలతో సహా బయటపెడుతున్నారు.. వివిధ మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆదాబ్ హైదరాబాద్ ను కూడా సంప్రదించి తమ అనుభవించిన కష్టాలు, సదరు పిల్లి రాము చేస్తున్న అక్రమాలను ఏకరువు పెట్టారు.. వీటి ఆధారంగా రాబోవు కథనాల్లో సైనిక్ పూరి భవన్స్ ఎఫ్‌డీలు, వడ్డీలను మింగేస్తున్న రాంబంధుపై వరుస కథనాలు అందిస్తాం..
