Saturday, March 21, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంPolitical Panchangam | రాజకీయ రంగు పులుముకున్న ఉగాది పంచాగం

Political Panchangam | రాజకీయ రంగు పులుముకున్న ఉగాది పంచాగం

  • ఒకే నక్షత్రం.. అన్ని పార్టీలకు అనుకూల ఫలితాలు..
  • ఇది నిజంగా భక్తా.. భజనా..? అన్న అనుమానాలు..
  • పార్టీ ఆఫీసును బట్టి మారిపోతున్న పంచాగం..
  • మీ అధికారం పదిలం అని అధికార పార్టీకి చెప్పాలి..
  • మీరు అధికారంలోకి వస్తారని ప్రతిపక్షాలకు చెప్పాలి..
  • నాయకుల అహాన్ని తృప్తిపరచడానికి పంతుళ్లు చేస్తున్న ప్రయత్నం..
  • రాజకీయ పార్టీల భవితవ్యం తేల్చేది రాశిచక్రం కాదు..
  • నాయకుల భవిష్యత్తును నిర్ణయించేది ప్రజల ఓటు చక్రం మాత్రమే..

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వచ్చిందంటే చాలు.. ఉగాది పచ్చడి వాసన కంటే ఎక్కువగా ‘రాజకీయ పంచాంగ శ్రవణాల’ హోరు వినిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే.. ఆకాశంలో గ్రహాలు అవే, నక్షత్రాలు అవే. పంచాంగం ఒక్కటే! కానీ, ఫలితాలు మాత్రం పార్టీ ఆఫీసును బట్టి మారిపోతుంటాయి. అధికార పక్షం దగ్గరకు వెళ్తే “మీకే తిరుగులేదు” అంటారు. ప్రతిపక్షం దగ్గరకు వెళ్తే “రాజయోగం మీ వెంటే ఉంది” అంటారు.

అసలు ఈ జ్యోతిష్యం శాస్త్రమా? లేక నాయకుల ‘అహం’ తృప్తి పరచడానికి పంతుళ్లు చేస్తున్న ‘పైడ్ సర్వీసా’? అయితే పంచాంగం అనేది దేశంలో ఏమూలనైనా ఒకటే.. ఏ భాషలోనైనా ఒక్కటే.. కానీ ప్రస్తుతం పంచాగం ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా మారిపోవడం దురదృష్టకరం..

- Advertisement -

నిజానికి నక్షత్రం ఒకటే అయినప్పుడు ఒకే ఫలితం ఉండాలి కదా..? అలా కాకుండా వేరు వేరు నమ్మకాలు, ఫలితాలు ఉంటాయా..? శాస్త్రం ప్రకారం అందరికీ రాశులు, నక్షత్రాలు ఒకటే. కానీ, రాజకీయాల్లోకి వచ్చేసరికి ‘వ్యక్తిగత జాతకం’ అనే ముసుగులో విశ్లేషణలు మారుతుంటాయి.పాలకుల పంచాంగంలో అధికారంలో ఉన్న వారికి “సింహాసనం పదిలం” అని చెప్పకపోతే పారితోషికం అందదు.

ప్రతిపక్ష పంచాంగంలో “గ్రహగతులు మారుతున్నాయి, అధికార పీఠం మీ వైపు వస్తోంది” అని చెప్పకపోతే వారికి ఆశ కలగదు. వీరిని పైకం దొరకదు.. అంటే ఇక్కడ వినిపించేది గ్రహాల గోచారం కాదు.. నాయకుల ‘కోరికల గోచారం’. అనేది స్పష్టం అవుతోంది..
జ్యోతిష్యం అనేది ఒక ‘రాజకీయ పిఆర్’ సాధనంగా మారిపోతోంది.. నేటి కాలంలో పంచాంగ శ్రవణం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమం కంటే ఎక్కువగా ‘పొలిటికల్ మార్కెటింగ్’ సాధనంగా మారింది.

ప్రజల్లో ఒక రకమైన సెంటిమెంట్ ను క్రియేట్ చేయడానికి జ్యోతిష్యులను వాడుకుంటున్నారు. వచ్చేది మన ప్రభుత్వమేనని పంతులు గారు చెప్పారు.. అని క్యాడర్లో ఉత్సాహం నింపడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుతున్నారు. ఇది శాస్త్రాన్ని నమ్మడం కంటే.. శాస్త్రం పేరుతో జనాల్ని నమ్మించడం లాంటిది. ఇక డబ్బు, హోదాకు పంతుళ్లు లొంగిపోతున్నారు.. చాలామంది మేధావుల విమర్శ ఏంటంటే..

సిద్ధాంతులు, పంతుళ్లు కూడా వ్యవస్థలో భాగమైపోయారు. అధికారంలో ఉన్న వారిని విమర్శిస్తే లేదా ‘ఓడిపోతారని’ చెబితే వచ్చే పరిణామాలకు భయపడి, కేవలం ‘శుభం’ మాత్రమే పలికే పరిస్థితి ఉంది. అంతే కాదు భారీ పారితోషికాలు, సన్మానాలు, పదవుల ఆశ చూపి నాయకులు తమకు అనుకూలంగా ‘స్క్రిప్ట్’ రాయించుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. అందుకే, ఒకే పంచాంగం నుంచి వేర్వేరు పార్టీలకు వేర్వేరు విజయాలు పుట్టుకొస్తున్నాయి..

అందుకే ప్రజలారా.. కాస్త ఆలోచించండి.. నిజంగానే గ్రహాలు అందరినీ గెలిపించేటట్లయితే.. ఓడిపోయిన నాయకులు తమ పంచాంగం చెప్పిన పంతుళ్లను ఎందుకు ప్రశ్నించరు? నాయకుల జాతకం ప్రజల చేతిలో అంటే ఓటు రూపంలో ఉందే తప్ప, ఆకాశంలో గ్రహాల చేతిలో లేదు. ఒక్కో పార్టీకి ఒక్కో రాశి ఉండదు. కానీ, నాయకుల పేరులోని అక్షరాల ఆధారంగా ‘నామ నక్షత్రం’ చూసి ఫలితాలు చెబుతారు. అయితే, ఆ ఫలితం కూడా పంతుగారికి ఆ నాయకుడిపై ఉన్న ‘అభిమానం’ లేదా ‘అవసరం’ మీద ఆధారపడి ఉంటుంది.

ఇక బడ్జెట్లో అంకెలు ఎలాగైతే గారడీ చేస్తాయో, పంచాంగంలో గ్రహాలు కూడా అలాగే గారడీ చేస్తున్నాయి. అందరూ ‘సూపర్’ అని పంతుళ్లు చెప్పడం వెనుక ఉన్న మర్మం.. “ఎవరినీ నొప్పించక, ఎవరి దగ్గరా డబ్బు వదులుకోక” అనే సూత్రం మాత్రమే. పనిచేస్తోంది.. పంచాంగం వినండి.. కానీ పరిపాలనను, ప్రజల తీర్పును మాత్రమే నమ్మండి. ఎందుకంటే అంతిమంగా గెలిపించేది ‘రాశి చక్రం’ కాదు.. ప్రజలు వేసే ‘ఓటు చక్రం’.

- Advertisement -
RELATED ARTICLES

Latest News