- డంపింగ్ యార్డ్ తరలింపు వరకు పోరాటం కొనసాగుతుంది
జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ ప్రజల ప్రాణాలను హరించే పెనుభూతంగా మారిందని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, భూమి కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో దోమలు అధికంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ప్రతిరోజూ సుమారు 8500 నుండి 12,500 టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారని, 339 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన చెత్త నుండి వెలువడుతున్న దుర్గంధపు నీరు సమీప చెరువులు, బోర్ల నీటిని కలుషితం చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని తెలిపారు. పక్షులు, జంతువులు కూడా నివసించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రాంకి సంస్థలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలుమార్లు జరిమానాలు విధిస్తూ ఆంక్షలు విధించిందని తెలిపారు. గతంలో జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా పాటించకపోవడంతో సంబంధిత సంస్థలకు జరిమానాలు విధించినట్లు బాధితులు గుర్తుచేశారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించలేదని విమర్శించారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించి పర్యావరణం, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై మునుపటి ఆదేశాలను పాటించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వెల్లడించారు. గత 30 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ వల్ల నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు మండిపడుతూ, డంపింగ్ యార్డ్‌ను జనవాసాల నుండి తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే లక్షలాదిగా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇక ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు రేపన్ లక్ష్మణ్ స్పందిస్తూ డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గాలి, నీటి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని అన్నారు. వేసవిలో తాగునీటి సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్‌ను తక్షణమే ఇతర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ, అది జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
