రబీ, వేసవి సీజన్ ప్రభావం తో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. దీనికి తగ్గట్టుగా అప్రమత్తంగా వుంటూ విద్యుత్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ ఇంజినీర్లకు, సిబ్బందికి ఆదేశించారు.
రబీ సీజన్ మరియు వేసవి కాల ప్రభావంతో దక్షిణ డిస్కం పరిధిలో గత కొద్దిరోజులుగా విద్యుత్ డిమాండ్ మరియు వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఈ నెల 13వ తేదీన గరిష్ట విద్యుత్ డిమాండ్ 11,318 మెగావాట్లకు చేరుకోగా, అదే రోజున విద్యుత్ వినియోగం 222.34 మిలియన్ యూనిట్లకు నమోదైంది. మార్చి చివరి వారానికి విద్యుత్ డిమాండ్ 12 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్ మరియు నల్లగొండ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ డిమాండ్ ఎంత పెరిగినా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
రబీ మరియు వేసవి కాలంలో పెరిగే అదనపు డిమాండ్‌ను తట్టుకునేందుకు డిస్కం పరిధిలో దాదాపు 5 వేల ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు 3 వేలకుపైగా ట్రాన్స్ఫార్మర్లను కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సీఎండీ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలోని పరిగిలో పర్యటించి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల పనితీరు, నిర్వహణపై అధికారులతో చర్చించారు.
ప్రతి సెక్షన్ పరిధిలో తగినంత స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ రోలింగ్ స్టాక్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని సీఎండీ అధికారులకు ఆదేశించారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని ఫిర్యాదు అందిన వెంటనే ఆ స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి, అనంతరం పాడైన ట్రాన్స్ఫార్మర్ను రిపేరింగ్ సెంటర్‌కు తరలించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులపై అదనపు భారం మోపకూడదని సీఎండీ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.
