Wednesday, March 11, 2026
Homeరంగారెడ్డిJawahar Nagar | సమస్యలపై బహిరంగ సభకు కరపత్రం ఆవిష్కరణ

Jawahar Nagar | సమస్యలపై బహిరంగ సభకు కరపత్రం ఆవిష్కరణ

జవహర్ నగర్ ప్రాంతంలోని వివిధ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో క్రాంతి కళాబృందం ఆధ్వర్యంలో ఈ నెల 22న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు జవహర్ నగర్ గ్రామపంచాయతీగా ప్రారంభమై తర్వాత మున్సిపల్ గా, అనంతరం జిహెచ్ఎంసి పరిధిలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

జవహర్ నగర్ ఏర్పడి దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ చాలామంది నోటరీ పత్రాల ఆధారంగానే ఇళ్లు నిర్మించుకోవాల్సి వస్తోందని, అధికారిక పర్మిషన్ లేకపోవడం వల్ల బ్యాంక్ లోన్ వంటి సౌకర్యాలు అందడం లేదని తెలిపారు. మరోవైపు యువతలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పెరుగుతూ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు మూడు లక్షల జనాభా ఉన్న జవహర్ నగర్ లో దాదాపు 90 కాలనీలు ఉండగా ప్రతి కాలనీలో ఒకటి రెండు బెల్ట్ షాపులు నడుస్తుండటంతో వందల సంఖ్యలో మద్యం విక్రయ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

- Advertisement -

దీనివల్ల 24 గంటలు మద్యం అందుబాటులో ఉండి ప్రజల్లో మద్యపానం పెరుగుతోందని పేర్కొన్నారు. రామ్కీ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం కారణంగా ప్రజలు అనేక రోగాలతో బాధపడుతున్నారని, భూగర్భ జలాలు, సమీప చెరువులు కూడా కాలుష్యానికి గురవుతున్నాయని చెప్పారు. అలాగే చాలా కాలనీల్లో చెత్తకుండీలు లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయాల్సి వస్తోందని, గల్లీలలో చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ కూడా ఇంకా సరిగా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

ఈ సమస్యలన్నింటిపై ప్రజలతో చర్చించి ప్రభుత్వానికి తెలియజేయడానికి నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, క్రాంతి కళాబృందం వ్యవస్థాపకులు వి వెంకటాచారి, ఎస్కే మీరా మస్తాన్ బి, షేక్షావలి, జంగిలి శ్రీనివాస్, పాక దేవేందర్, శనిగరం నరసింహులు, నిమ్మల నరసింహ, సురేష్, కోడూరి శ్రవణ్, ఆంజనేయులు, మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News