ప్రపంచ శాంతి సాధనకు మహిళల హక్కుల పరిరక్షణకు శ్రామిక మహిళలు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ (విముక్తి) రెండు తెలుగు రాష్ట్రాల కన్వీనర్ పెర్క సునీత, జవహర్ నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా పిలుపునిచ్చారు. కాప్రా, జవహర్ నగర్ జిహెచ్ఎంసి పరిధిలోని చెన్నాపూర్, దేవేందర్ నగర్ ప్రాంతాల్లో మార్చి 8న నిర్వహించిన 116వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమం యమునా గౌడ్, మహ్మద్ పుతిలీ బీ అధ్యక్షతన జరిగింది. ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న వివక్ష, అణచివేత, వర్గ దోపిడీకి వ్యతిరేకంగా శ్రామిక మహిళలు ఐక్యంగా గొంతెత్తే రోజే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవమని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి పేర్కొన్నారు. స్త్రీ పురుష సమానత్వం, సమాన పనికి సమాన వేతనం ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తుమ్మరాణి తెలిపారు.
మధ్య భారతదేశంలో ఆపరేషన్ ఖగార్ పేరుతో ఆదివాసి మహిళల జీవన విధానాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలంగాణ ఉద్యమకారిణి పోత సునీత ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన విధానాలను అనుసరించి ఆదివాసీ ప్రజల హక్కులను పరిరక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పశ్చిమాసియా దేశాల్లో ఆయిల్ వనరుల కోసం జరుగుతున్న యుద్ధాలను వెంటనే నిలిపివేయాలని పిఓడబ్ల్యూ (విముక్తి) రాష్ట్ర నాయకురాలు నిర్మల్ కళక్క డిమాండ్ చేశారు.

రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ప్రపంచ దేశాలు శాంతి సాధనకు కృషి చేయాలని ముస్లిం కమిటీ కార్యదర్శి టి.కాలేషా విజ్ఞప్తి చేశారు. స్త్రీల అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి పూలే, షేక్ ఫాతిమా వంటి మహనీయుల ఆదర్శాలను అనుసరించాలని దక్షిణ భారత సమాఖ్య నాయకుడు మహ్మద్ రషీద్ ద్రావీడ సూచించారు.
కుల మత ప్రాంతీయ విద్వేషాలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని ఆడజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మైనారిటీ విభాగానికి చెందిన మథీన్, బహుజన రక్షణ సమితి మహ్మద్ జావేద్, టివిఐకె మబ్బు బాలు, ముస్లిం కమిటీ సభ్యులు సైయద్, అబ్బు, దౌలత్ బీ, యశరత్ బీ తదితరులు పాల్గొన్నారు.
