- శ్రీకృష్ణుడు తెలిపిన గొప్ప విషయాలు ఇవే..
తపస్సు అనే మాట వినగానే పూర్వకాలం రుషులు, మునులు కళ్లుమూసుకుని అడవుల్లో రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ధ్యానం చేసేవారని పెద్దలు చెబుతుంటారు. పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. మరి ఆధునిక కాలంలో తపస్సు అంటే అలా సాధ్యమవుతుందా? జనజీవనం మధ్య ఉంటూనే తపస్సు ఆచరించడం ఎలా? సాధ్యమవుతుందా? తపస్సు గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?
భగవద్గీతలో శ్రీకృష్ణుడు తపస్సుని మూడు రకాలుగా విభజించాడు శరీరం, వాక్కు, మానసికం.. దేవతలను, ద్విజులను, ప్రాజ్ఞులగు జ్ఞానులను పూజించటమే శారీరక తపస్సు. శుచి అయిన సానుకూల భావాలు కలిగి ఉండటం. కుటిలత్వం లేకపోవటం. మనోవాక్కాయములతో ఒకే రీతి అయిన భావప్రకటనలు కలిగి ఉండటం . బ్రహ్మచర్యాన్ని వ్రతదీక్షగా పాటించటం , అహింసకు దూరంగా ఉండడం…ఇదే శారీరక తపస్సు. ఈ తపస్సు శరీరాన్ని శుద్ధి చేసి ఆరోగ్యం, శక్తిని ఇస్తుంది
ఉద్రేకం, భయం, ఆవేశం ఏర్పడకుండా మాట్లాడడం – నిజాలు మాత్రమే మాట్లాడడం – శాస్త్ర గ్రంథాలు పఠించడం – భగవంతుడిని ధ్యానించడం, వేదాభ్యాసం ఇవన్నీ వాక్ తపస్సులో భాగం
మనస్సును పవిత్రంగా, దుష్టభావాలకు రహితంగా, దురభిప్రాయాలకు రహితంగా ఉంచుకోవటం – ప్రాపంచిక విషయాల పట్లా , జీవితంలోని సర్వ సంఘటనలపట్ల ఉద్వేగరహితమైన మౌన పాటించడం , మంచి విషయాలను గ్రహించడం ఇదే మానసిక తపస్సు. ఇది మనస్సుని నియంత్రించి ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీస్తుంది
గుర్తింపు కోసం, సల్పకాలిక ప్రయోజనాల కోసం చేస్తున్న శారీక, వాక్, మానసిక తపస్సులను రాజసిక తపస్సు అంటారు. ఇది అస్థిరమైన, చంచలమైన తాత్కాలిక ఫలితాలను ఇస్తుంది
మూఢత్వంతో కూడిన పట్టుదల, జీవులను హింసించి, వారికి నష్టం కలగజేయాలన్న ఉద్దేశం, ఇతరులను వశం చేసుకోవాలి అనే ఆశయాలతో చేసే శారీరక , వాచిక, మానసిక తపస్సును తామస తపస్సు అంటారు. ఇది అత్యంత హానికరం
భగవద్గీత ప్రకారం తపస్సు అంటే కష్టపడడం కాదు. అది శరీరం, మాట, మనస్సుని శుద్ధి చేసుకోవడం. ఇంద్రియాలను నియంత్రించడం, సాత్విక తపస్సు మాత్రమే శాశ్వత శాంతినిస్తుంది, మోక్షానికి దారితీస్తుంది. రాజస, తామస తపస్సులు మంచి ఫలితాలను ఇవ్వవు పైగా హానిచేస్తాయి.
