Wednesday, May 6, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | ఖానామెట్ భూదందా..!

Encroachment | ఖానామెట్ భూదందా..!

ఖానమేట్ భూములపై పంజా విసిరిన గోటూరి అమర్నాథ్ రెడ్డి

  • నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం..
  • కలెక్టర్, ఆర్దీఓ, ఎం.ఆర్.ఓ.ల కళ్ళముందు వాస్తవాలు..
  • లోపభూయిష్టమైన నోటీసులతో ఆక్రమదారునికి అండ..
  • చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోంది..
  • కోర్టుల నుంచి సులువుగా స్టే తెచ్చుకుంటున్న అక్రమార్కుడు..
  • అమర్నాథ్ అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు ఆఫీసర్స్..
  • తప్పుడు నోటీసులతో స్టేలకు మార్గం.. 50కిపైగా కేసులు..?
  • పేదల భూములపై దాడులు.. బాధితులకు న్యాయం ప్రశ్నార్థకం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న శేర్లింగంపల్లి మండలం ఖానమేట్ గ్రామంలో భూదందా ‘విశ్వరూపం’ దాల్చుతోంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు గోటూరి అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి కనుసన్నల్లో ఆక్రమణలకు గురవుతున్నా, వ్యవస్థలోని కీలక అధికారులు ‘మౌనమే ముద్ర’ అన్నట్లు వ్యవహరిస్తుండటం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రగల్భాలు పలికే కలెక్టర్, ఆర్.డీ.ఓ., ఎం.ఆర్.ఓ.లు కళ్ళముందే కబ్జాలు జరుగుతున్నా ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని స్థానికులు గళమెత్తుతున్నారు.

- Advertisement -

ఆక్రమణదారుడికి ‘రెడ్ కార్పెట’ :
అధికారుల ‘నోటీసుల’ మాయాజాలం!

గోటూరి అమర్నాథ్ రెడ్డి సాగిస్తున్న భూ ఆక్రమణల పర్వంలో రెవెన్యూ అధికారులు అతనికి పరోక్షంగా సహకరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. భూ ఆక్రమణ జరిగినప్పుడు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన నోటీసుల్లో కావాలనే ‘సాంకేతిక లోపాలు’ ఉండేలా చూస్తూ ఆక్రమణదారుడికి అధికారులు మేలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

సెక్షన్ల మార్పిడి :

అసైన్డ్ భూములకు అసైన్డ్ చట్టాల ప్రకారం, ప్రభుత్వ భూములకు భూ ఆక్రమణ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వాలి. కానీ, అధికారులు తప్పుడు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేయడం ద్వారా ఆక్రమణదారుడు కోర్టులకు వెళ్లి సులువుగా ‘స్టే’ తెచ్చుకునేలా మార్గం సుగమం చేస్తున్నారు.

కౌంటర్ దాఖలులో తాత్సారం :

గోటూరి అమర్నాథ్ రెడ్డిపై వేసిన దాదాపు 50కి పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నా, ఒక్క కేసులో కూడా ప్రభుత్వం తరపున బలమైన కౌంటర్ దాఖలు చేసి ‘స్టే’ వెకేట్ చేయించిన దాఖలాలు లేకపోవడం అధికారుల చిత్తశుద్ధిని శంకిచాల్సిన పరిస్థితి ఏర్పడింది..

పేదల భూములపై గోటూరి అమర్నాథ్ రెడ్డి దాడి :
వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో దిట్ట :

రాజకీయ పలుకుబడి, అధికార గర్వంతో గోటూరి అమర్నాథ్ రెడ్డి అమాయక ఎస్సీ, బీసీ, మైనారిటీల పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటున్నాడు. లక్ష గజాలకు పైగా భూమిని తన గుప్పిట్లో పెట్టుకుని భూ సామ్రాజ్యాన్ని నడుపుతున్నా అధికారులకు చలనం లేదు. సామాన్యుడు సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే ‘సిబ్బంది కొరత’ అని నెలల తరబడి తిప్పించుకునే యంత్రాంగం, గోటూరి అమర్నాథ్ రెడ్డి పనుల విషయానికి వస్తే మాత్రం ‘రాకెట్ వేగంతో’ స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

నిబంధనలు ‘తుంగలో’.. రహస్య సర్వేల పర్వం!

ఇటీవల ఖానమేట్‌లోని సర్వే నంబర్ 41/11లో సుమారు కొన్ని వందల గజాల అసైన్డ్ భూమిని గోటూరి అమర్నాథ్ రెడ్డి తన అనుచరుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే, సర్వే నంబర్ 60 లో నోటీసుల గడువు ముగియకముందే, నిబంధనలకు విరుద్ధంగా ఆగమేఘాలపై రహస్యంగా సర్వే నిర్వహించడం అధికారుల పక్షపాత వైఖరికి నిదర్శనం.

కాగా గతంలో సర్వే నెంబర్ 41/5లో ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని గోటూరి అమర్నాథ్ రెడ్డికి శేరిలింగంపల్లి తహశీల్దార్ లోటీసులు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి..

ప్రశ్నార్థకంగా బాధితుల భవిష్యత్తు :

వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం అవుతున్నా, హైకోర్టులో సరైన ఆధారాలు సమర్పించడంలో రెవెన్యూ, జీహెచఎంసీ అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని.. గోటూరి అమర్నాథ్ రెడ్డిపై ఉన్న అన్ని కేసుల్లో తక్షణమే స్పెషల్ కౌంటర్లు దాఖలు చేయాలి. ఆక్రమణదారులకు తొత్తులుగా మారిన కొందరు అధికారులపై అంతర్గత విచారణ జరిపించాలి. ఖానామేట్ భూములను ఆక్రమణల నుండి విడిపించి బాధితులకు న్యాయం చేయాలి లేదా ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి.

అక్రమార్కుల ఆగడాలను, అధికారుల బండారాన్ని బయటపెట్టడంలో మేము వెనకడుగు వేయము. వచ్చే కథనంలో సర్వే నంబర్ 41/11/ఏ, 41/13/ఏ లోని సుమారు కొన్ని ఎకరాల భూ అక్రమణల పూర్తి వివరాలతో మీ ముందుకు తీసుకుని రాబోతున్నాం.

“మా అక్షరం.. అవినీతిపై అస్త్రం!”

- Advertisement -
RELATED ARTICLES

Latest News