- ధీమా వ్యక్తం చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్..
- ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకు వెళతాం..
- పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి..
జీ. హజ్జెచ్.ఎం.సి. ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళతామని అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతోనే కరీంనగర్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద మొక్కులు తీర్చుకునేందుకే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి ఆలయానికి వచ్చినట్లు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ ఆలయం ఎంతో పవర్ఫుల్ అని, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే పంజాబ్లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఈ ఆలయాన్నీ గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామన్నారు. పాతబస్తీ హిందువులకు భాగ్యలక్ష్మీ అమ్మవారు రక్షణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ప్రజా సంగ్రామ యాత్రను భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించామని, కేసీఆర్ ప్రభుత్వ అడ్డంకులను ఎదుర్కొని 1640 కిలోవిటర్ల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశామని బండి సంజయ్ తెలిపారు.
హైదరాబాద్ లో హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా అడ్డుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్.. ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం, బంజారాహిల్స్ పెద్దమ్మ ఆలయం, శంషాబాద్ ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. బాన్సువాడలో హిందువులపై రాళ్లదాడి జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని, అమాయకులను అరెస్ట్ చేయడం సరికాదని కేంద్ర మంత్రి మండిపడ్డారు.
పోలీసులు అక్రమ అరెస్టులను ఆపాలని హెచ్చరించారు. అవసరమైతే తానే బాన్సువాడకు వెళ్లి హిందువులకు రక్షణగా నిలుస్తానన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు బకాయిలు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
