Tuesday, February 10, 2026
Homeమెదక్‌Edupayala | వనదుర్గమ్మకే శఠగోపం పెడుతున్న పాలకులు!

Edupayala | వనదుర్గమ్మకే శఠగోపం పెడుతున్న పాలకులు!

  • ‘కేసీఆర్ 100 కోట్లు, రేవంత్ 35 కోట్లు’ హామీలు ఎక్కడ?
  • దాతలు, భక్తులతోనే ఆదాయం.. పాలకులది హడావుడే..!
  • మహిళా భక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు
  • బీజేపీ పాపన్నపేట మండల అధ్యక్షుడు సంతోష్ చారి

ప్రసిద్ధి చెందిన ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయ అభివృద్ధి విషయంలో పాలకులు భక్తులను మోసం చేస్తున్నారని బీజేపీ పాపన్నపేట మండల అధ్యక్షుడు సంతోష్ చారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాశివరాత్రి జాతర నేపథ్యంలో మంగళవారం బిజెపి మండల శ్రేణులతో ఏడుపాయలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమ్మవారి సాక్షిగా ఇచ్చిన హామీలు మాటలకే పరిమితమైయ్యాయని ఆయన ఆరోపించారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.100 కోట్లు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.35 కోట్లు ఇస్తామని ప్రకటించాయని గుర్తు చేసిన ఆయన… “ఆ నిధులు ఎక్కడ? ఆలయానికి వచ్చినదేమిటి?” అని ప్రశ్నించారు. ప్రతి ఏటా జాతర సమయానికి తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టడం తప్ప శాశ్వత అభివృద్ధికి పాలకులు చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.

- Advertisement -

ఆలయ అభివృద్ధి మొత్తం దాతలు, భక్తుల సహకారంతోనే జరుగుతోందని, ప్రభుత్వాల నుంచి ఆశించిన సహాయం లేదని సంతోష్ చారి స్పష్టం చేశారు. వేలాది మంది భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా, నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మహిళ భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం తీవ్రంగా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా మహిళా భక్తుల ఆత్మగౌరవం దెబ్బతింటున్నదని, ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృష్టి సారించి భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే భక్తుల సౌకర్యార్థం శాశ్వత వసతి గృహాలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం హామీలను అమలు చేసి, వనదుర్గామాత ఆలయాన్ని భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సంతోష్ చారి కోరారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News