Wednesday, March 18, 2026
Homeరంగారెడ్డిMoinabad | మొయినాబాద్‌లో న్యాయవాదిని హత్య కలకలం

Moinabad | మొయినాబాద్‌లో న్యాయవాదిని హత్య కలకలం

  • ఆస్తి తగాదాలే కారణం.. సొంత అన్నే గొంతు కోశాడు..
  • మొయినాబాద్ పిఎస్ ముందు న్యాయవాదుల ధర్నా

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో మహిళా న్యాయవాదిని హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో సొంత అన్నే చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారింది. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన స్వప్న(34) ఎల్ఎల్బీ పూర్తి చేసి ప్రస్తుతం చేవెళ్ల కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తోంది.

తల్లి పేరిట ఉన్న 10 ఎకరాల భూమి పంపకాల విషయంలో స్వప్న, అన్న రాజు మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. భూమిని 6 ఎకరాలు రాజుకు, 4 ఎకరాలు స్వప్నకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు భావించగా, రాజు మాత్రం 2 ఎకరాలు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగాడు. ఈ విషయంలో గ్రామంలో పలు మార్లు పంచాయితీలు కూడా జరిగాయి.

- Advertisement -

ఈ క్రమంలో బుధవారం స్వప్న తన తల్లితో కలిసి ల్యాండ్ సర్వే చేయించేందుకు సర్వేయర్ను తీసుకొని పొలం వద్దకు వెళ్లింది. విషయం తెలుసుకున్న రాజు మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో స్వప్నపై రాయితో దాడి చేసి, అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.

గమనించిన గ్రామస్తులు వెంటనే స్వప్నను చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని భాస్కర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకున్నట్లు ప్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

న్యాయవాదుల ఆగ్రహం..

స్వప్న హత్యపై చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గత నాలుగు నెలలుగా రాజు తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని, రెండు సార్లు కారుతో ఢీకొట్టి హత్యాయత్నం కూడా చేశాడని స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు ముందే స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని మండిపడ్డారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News