- ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య..
- ఉత్సాహంతో పని చేయండి, బి ఫామ్ లు అందించి ఉత్తేజాన్ని నింపిన ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీ–ఫారమ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుపొందుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
నామినేషన్ దశలో ఎలా ఉత్సాహంగా బీ–ఫారమ్‌లు స్వీకరించామో, అదే ఉత్సాహంతో గెలుపొందిన అనంతరం గెలుపు ధ్రువీకరణ పత్రాలను కూడా ఇదే విధంగా స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పథంలో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
