- నిబంధనలకు తిలోదకాలు..
- కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేసిన వైనం!
- మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీ భూకుంభకోణం
- కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు ఎలా మారాయి?
- “ఆదాబ్ హైదరాబాద్” ప్రత్యేక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్
దేశ విభజన అనంతరం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా, వలస వెళ్లిన వారి ఆస్తులను కాపాడేందుకు రూపొందించిన ‘కస్టోడియన్ భూములు’ నేడు అవినీతిపరుల చేతుల్లో బందీగా మారుతున్నాయి. చట్టాలు స్పష్టంగా ఉన్నా, నిబంధనలు కఠినంగా ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం ? అక్రమాల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి జారిపోతున్నాయి.
ఈ భూకుంభకోణానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా, కీసర డివిజన్, ఉప్పల్ మండలంలోని సర్వే నంబర్లు 644, 645లలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల ఏడు గుంటల కస్టోడియన్ భూమి. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమి, నేడు ప్రైవేట్ వ్యక్తుల నియంత్రణలోకి వెళ్లి, బహుళ అంతస్తుల నిర్మాణాలకు వేదికగా మారడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

కస్టోడియన్ భూములపై ఎవరి హక్కు
చట్టపరంగా, దేశ విభజన సమయంలో వదిలివెళ్లిన ఆస్తులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవిగా పరిగణించబడతాయి. ఈ ఆస్తుల పరిరక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం నియమించిన “కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా” నిర్వహిస్తుంది. ఈ భూములపై పూర్తి అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది.
The Administration of Evacuee Property Act, 1950, The Enemy Property Act, 1968, ఇనివఎఎ ఖతీనీజూవతీబిఎ ంఇబి, 1968 అనే కేంద్ర చట్టాల ప్రకారం కస్టోడియన్ భూములను విక్రయించడం, ఇతరులకు బదిలీ చేయడం, పట్టాలు జారీ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా చేయడం పూర్తిగా అక్రమం. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, జిల్లా రెవెన్యూ అధికారులు గానీ, స్థానిక సంస్థలు గానీ ఈ భూములపై హక్కులు కల్పించే అధికారం చట్టపరంగా కలిగి ఉండరు.
అయితే ఇక్కడ ఏం జరిగింది?
కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే, నిబంధనలను తుంగలో తొక్కుతూ ఈ కస్టోడియన్ భూమికి పట్టాలు మారిపోయాయి. రికార్డుల తారుమారు, అధికారుల అండదండలు, రాజకీయ ఒత్తిళ్లు, ఇవన్నీ కలిసే ఈ అక్రమ భూ బదిలీకి దారి తీశాయని ప్రాథమిక పరిశీలనలో స్పష్టమవుతోంది. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన కొందరు అధికారులు, అక్రమార్కులతో చేతులు కలిపి, ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక భూ అక్రమం మాత్రమే కాదు? దేశ ఆస్తులపై జరిగిన వ్యవస్థాగత దోపిడీగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఫిర్యాదులున్నా స్పందన శూన్యం!
ఈ అక్రమాలపై ముందుగానే “ఆదాబ్ హైదరాబాద్” ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ప్రభుత్వ భూములను, ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆస్తులను కాపాడాల్సిన అధికారులు ఇలా ప్రేక్షక పాత్ర పోషించడం వారి విధుల పట్ల ఉన్న నిబద్ధతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఉప్పల్ మండలంలోని కస్టోడియన్ భూములపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, అక్రమంగా బదిలీ అయిన భూములను వెంటనే కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని, అలాగే ఈ వ్యవహారానికి బాధ్యులైన అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
కస్టోడియన్ భూములపై జరుగుతున్న ఈ అక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కేంద్ర ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమయ్యే ప్రమాదానికి సంకేతమా? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ భూములను కాపాడుతారా? లేదా ఎప్పటిలాగే ప్రేక్షక పాత్రకే పరిమితమవుతారా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
