- విజృంభిస్తున్న జీవనశైలి వ్యాధులు..
- ఆందోళన కలిగిస్తున్న కేంద్రం గణాంకాలు..
- ప్రతి పది మందిలో నలుగురికి గుండెపోటు ముప్పు..
- దురలవాట్లు, నిద్రలేమి దెబ్బతీస్తున్నాయి
- జాగ్రత్త పడకపోతే పెను ప్రమాదం
తెలంగాణలో జీవనశైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య గణాంకాలు చూస్తే మనం ఎంత డేంజర్ జోన్ లో ఉన్నామో తెలియజేస్తుంది. ప్రతి పది మందిలో నలుగురికి గుండెపోటు ముప్పు ఉంది. ఇక మరణాల్లో 42శాతం గుండె సంబంధిత వ్యాధులే. స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్ వల్ల యువతలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతున్నది.
పని ఒత్తిడి, నిద్రలేమి లాంటి సమస్యలూ కారణాలే అంటున్నారు డాక్టర్లు. అయితే ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుండటం ఆందోళన కలిగి స్తోంది. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే పరిమితమైన గుండె జబ్బులు.. ఇప్పుడు పిల్లలు, యువత, మధ్య వయస్కుల్లోనూ కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవిస్తున్న మరణాల రేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. వైద్యపరంగా ధృవీకరించిన మరణాల్లో దాదాపు 42 శాతం గుండె, రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం నివేదిక స్పష్టం చేసింది. గుండెపోటు, అధిక రక్తపోటు, పక్షవాతం లాంటి సమస్యలతోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
నివేదిక చెప్తున్నదిదే :
రిజిస్ట్రార్ జనరల్ ఇండియా (ఆర్జీఐ) తాజాగా విడుదల చేసిన మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ (ఎంసీసీడీ) 2023 నివేదిక ప్రకారం.. ఆసుపత్రుల్లో లేదా వైద్య పర్యవేక్షణలో మరణించిన ప్రతి 100 మందిలో 42 మంది గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. జాతీయ స్థాయిలో ఈ రేటు 30 -36 శాతం మధ్య ఉండగా, తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా నమోదు కావడం వైద్య వర్గాలను విస్మయానికి గురిచేసింది.
యువతలో పెరుగుతున్న కార్డియాక్ మరణాలు :
నివేదికలో మరో కీలక అంశం ఏమి టంటే.. గతంలో 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపించే గుండె వ్యాధులు.. ఇప్పుడు 30-40 ఏళ్ల వయస్సు గల వారిలో రాపిడ్ గా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో మరణాలు అధికంగా నమోదవుతున్నట్లు నివేదిక సూచిస్తోంది.

మరణాల ధృవీకరణలో 12వ స్థానం :
2023 సంవత్సరంలో తెలంగాణలో మొత్తం 2,40,058 మరణాలు నమోదయ్యాయి. వీటిలో కేవలం 92,068 కేసులు (38.4శాతం) మాత్రమే వైద్యపరంగా ధృవీకరించారు. ధృవీకరణ రేటులో గోవా రాష్ట్రంలో 100శాతం మరణాల ధృవీకరణ జరుగుతున్నది. మహారాష్ట్ర 42.4 శాతం ధృవీకరణ మాత్రమే జరుగుతుండగా తెలంగాణ 38.4 జరుగుతోంది. మరణాల ధృవీకరణలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉండగా తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దే మరణాలు సంభవించడం, వైద్య పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణమని ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇంకా ఎక్కువగా మరణాలు ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
క్యాన్సర్ విషయంలో కొంత ఊరట :
వైద్య ధృవీకరణ మరణాల్లో క్యాన్సర్ వాటా తెలంగాణలో కేవలం 1.5 శాతం మాత్రమే నమోదైంది. ఇది ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల కేసులు బయటపడటం లేదని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బుల తర్వాత స్థానంలో శ్వాసకోశ వ్యాధులు నిలిచాయి. వీటి వల్ల 7.2 శాతం మంది మృతి చెందుతున్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 1 నుంచి 4 ఏళ్ల చిన్నారుల్లో న్యుమోనియా, ఆస్తమా లాంటి వ్యాధులు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో 19.4 శాతం మరణాలకు స్పష్టమైన కారణం నమోదు కాకపోవ డం మరో ఆందోళనకర అంశంగా నివేదిక పేర్కొంది.
మన చేతుల్లోనే మన ఆరోగ్యం :
ప్రస్తుత జీవనశైలి మార్పులే గుండె జబ్బుల పెరుగుదలకు ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసిన నేపథ్యంలో… జీవనశైలిలో మార్పులు చేసుకోక పోతే భవిష్యత్తు లో ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకా శం ఉంది. ఈ ప్రమాదం బారినుండి తప్పించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. జీవనశైలి మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అవేమిటంటే… రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించే ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచు కోవడంపై దృష్టి సారించాలి.
స్నేహితులు, బంధువులతో టచ్ లో ఉండ టం, అనవసర విషయాల్లో తలదూర్చక పోవడం, పొగతా గడం, మద్యపానం తగ్గించడం, తక్కువ కొవ్వు – తక్కువ ఉప్పు ను వాడాలి. అలాగే రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించు కోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
