Tuesday, February 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSuryapet | పేట ఓట్లలో అవకతవకలు.!

Suryapet | పేట ఓట్లలో అవకతవకలు.!

  • ఓటర్ల జాబితా తప్పుల తడకపై హైకోర్టు మండిపాటు.?
  • పదుల సంఖ్యలో వార్డుల్లో ప్రశ్నగా మారిన ఓటర్ల జాబితా.
  • వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించిన ఉన్నత న్యాయస్థానం.
  • చనిపోయిన వారిని జాబితాలో ఉంచడం పై హైకోర్టు విస్మయం.

సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా తీవ్ర వివాదానికి దారితీసింది. ఓటర్ల నమోదు ప్రక్రియలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ పట్టణానికి చెందిన డి. శివప్రసాద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ అంశాన్ని సిరియస్ గా పరిగణనలోకి తీసుకుంది. లేని వ్యక్తులను ఓటర్లుగా చూపడం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఒకే వ్యక్తి పేరు ఒకే వార్డులో లేదా వేర్వేరు వార్డుల్లో రెండుసార్లు నమోదు కావడం వంటి ఆరోపణలపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్‌ను జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి విచారించగా, ఓటర్ల జాబితా తయారీలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రాథమిక వాదనల్లో బలం ఉన్నట్లు కోర్టు భావించినట్లు తెలుస్తోంది.వాస్తవ జనాభాకు మించి ఓటర్లు పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్. శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, సూర్యాపేట పట్టణంలోని దాదాపు అన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య వాస్తవ జనాభాను మించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇది గణాంకపరంగా సాధ్యం కాని పరిస్థితి అని పేర్కొన్నారు.

- Advertisement -

ఉదాహరణకు 7వ వార్డులో మొత్తం జనాభా 2,190 మాత్రమే ఉండగా, ఓటర్ల సంఖ్య 2,212గా నమోదయ్యిందని, అంటే 22 ఓట్లు అదనంగా ఉన్నాయని వివరించారు. ఇదే తరహాలో అనేక వార్డుల్లో జనాభాకు మించిన ఓటర్లు నమోదైనట్లు పిటిషనర్ గణాంకాలతో సహా వివరించారు.

19వ వార్డులో 151
21వ వార్డులో 183
22వ వార్డులో 80
26వ వార్డులో 4
30వ వార్డులో 92
31వ వార్డులో 118
33వ వార్డులో 156
34వ వార్డులో 98
37వ వార్డులో 263
38వ వార్డులో 325
40వ వార్డులో 186
41వ వార్డులో 159
42వ వార్డులో 137
43వ వార్డులో 351
44వ వార్డులో 240
45వ వార్డులో 381
48వ వార్డులో 395
ఇలా అసాధారణంగా అధిక (3,341) సంఖ్యలో ఓటర్లు నమోదు కావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోందని పిటిషనర్ వాదించారు.డూప్లికేట్ ఓట్లు, మృతుల పేర్లు, ఒక్కో వ్యక్తి పేరు ఒకే వార్డులో రెండుసార్లు లేదా వేర్వేరు వార్డుల్లో నమోదు కావడం, ఇప్పటికే మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి అంశాలు కూడా ఓటర్ల జాబితాలో స్పష్టంగా కనిపిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇవన్నీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వాదించారు.

కుల రిజర్వేషన్‌పై ప్రభావం :

ఈ అవకతవకల ప్రభావం కేవలం ఓటర్ల సంఖ్యకే పరిమితం కాదని, వార్డు వారీ కుల రిజర్వేషన్ కేటాయింపులపై కూడా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పిటిషనర్ కోర్టుకు వివరించారు.కులాల వారీగా ఓట్ల సంఖ్య పెరగడం లేదా తగ్గడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ లెక్కలు మారే అవకాశం ఉందని, ఇది రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ విధానానికే భంగం కలిగిస్తుందని వాదించారు.

హైకోర్టు కీలక ఆదేశాలు :

వాదనలు విన్న అనంతరం హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ 19-01-2026న జిల్లా అధికారులకు సమర్పించిన అభ్యంతరాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించింది. కుల రిజర్వేషన్, వార్డు వారీ రిజర్వేషన్ కేటాయింపుల్లో ఉన్న లోపాలపై పిటిషనర్‌కు పూర్తి స్థాయిలో వినికిడి అవకాశం కల్పించి, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.ఈ ప్రక్రియను ఆదేశాల ప్రతిని స్వీకరించిన తేదీ నుంచి ఏడు రోజుల్లోపు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసును తదుపరి విచారణకు ఫిబ్రవరి 20, 2026 కి వాయిదా వేసింది.

మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ :

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ హైకోర్టు ఆదేశాలు రాజకీయంగా, పరిపాలనపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తుది ఓటర్ల జాబితా, కుల రిజర్వేషన్ అంశాలపై జిల్లా కలెక్టర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీపై స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఈ పరిణామాలతో సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News