Friday, February 13, 2026
HomeతెలంగాణKTR | ఉసురు తీసుకున్న అన్నదాతలు

KTR | ఉసురు తీసుకున్న అన్నదాతలు

  • ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య..
  • తెలంగాణాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి
  • అన్నదాత పరిస్థితి అనాథలా మారడం శోచనీయం
  • ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన బీ.ఆర్.ఎస్. నేత కేటీఆర్
  • తక్షణమే వారికి రూ. 25 లక్షల చొప్ప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతన్నలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యరాష్ట్రంనాటి సంక్షోభపరిస్థితులు తెలంగాణవ్యాప్తంగా నెలకొని ఉన్నాయ నడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమని అన్నారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ఈ చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని మండిపడ్డారు. భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్ లో దేవ్ సోత్ సర్వేశ్, ఆదిలాబాద్ లో జాదవ్ అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ ముగ్గురు రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం కావడం. రేవంత్ సర్కారు మోసాలను, అబద్ధపు హామీల పేరిట చేసిన తీరని ద్రోహాన్ని అడుగడుగునా ఎత్తిచూపుతోందని అన్నారు. రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు, పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దెబ్బతీయడంతో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని అన్నారు. కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు గుండెపగిలి బలవన్మరణాలకు పాల్పడినా ఈ సన్నాసి సర్కారుకు ఇప్పటికీ దిగుబడిని సోయి రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణ మృదంగానికి రేవంత్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

అన్నదాతలారా.. దయచేసి ధైర్యం కోల్పోకండి. మరో మూడేళ్లు ఓపిక పట్టండని సూచించారు. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని, రైతు ద్రోహి రేవంత్ ను గద్దె దించుదామని.. మన తెలంగాణాలో వ్యవసాయరంగానికి మళ్లీ మంచిరోజులు తెచ్చుకుందామని అన్నారు. వివరాల్లోకి వెళితే.. అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కోడెల సదానందం (42) పోతులవాయి శివారులో తనకున్న 4 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ.2 లక్షలకుపైగా అప్ప్పు అలాగే ఉండిపోయింది.

అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్పై శ్రీనివాస్ తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బతుకమ్మతండాకు చెందిన రైతు దేవ్సోత్ సర్వేశ్ (57) తనకున్న ఎకరం ఐదు గుంటల పొలంలో బోరు వేశాడు. ఇల్లు కట్టి, ఇద్దరు కుమారుల పెండ్లి చేయడానికి రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు ఎక్కువయ్యే సరికి వాటిని ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 11న పెద్దకొడుకు అనిల్కు ఫోన్చేసి గడ్డిమందు తాగిన ట్టు చెప్పాడు.

వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడ నుంచి హైదరాబాద్ లోని గాంధీ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పి ట్గావ్ గ్రామానికి చెందిన రైతు జాదవ్ అంకుష్ (33) తనకున్న మూడెకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. ఇందుకోసం అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనకు గురైన అంకుష్ ఈనెల 18న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News