Monday, February 16, 2026
Homeఆంధ్రప్రదేశ్Pawan Kalyan | నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు అంజన్న

Pawan Kalyan | నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు అంజన్న

  • సమష్టిగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేద్దాం
  • గిరి ప్రదక్షిణ మార్గం సాకారం కావాలి
  • మీరు పనులు మొదలుపెడితే స్వయంగా వచ్చి కరసేవ చేస్తా
  • జగిత్యాల జిల్లాలోని ఈ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన టీటీడీకి ధన్యవాదాలు
  • పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

‘కొండగట్టు అంజన్న అంటే నాకు సెంటిమెంట్. అంజన్న ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డా. కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంజనేయ స్వామి (Lord Anjaneya) అందరి దేవుడు. విశ్వాంతర్యామి. ఆయన ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదు. మా ఇలవేల్పు ఆంజనేయ స్వామి వారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా.

కొండగట్టు (Kondagattu) శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరిప్రదక్షిణ(Giripradakshina) మార్గాన్ని కూడా సాకారం చేద్దాం. అందరం పూనుకొని స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దాం’ అని ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్ అన్నారు. రామ భక్తులు (Devotees Of Rama) అనుకుంటే కానిదంటూ ఏదీ ఉండదని, త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు (Development works) జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు.

- Advertisement -

బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందించినందుకు ఆనందంగా ఉందని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.35.19 కోట్లతో వసతి సముదాయం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. 2024 ఎన్నికల ముందు వారాహి యాత్ర ప్రారంభ సమయంలో కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనానికి పవన్ కళ్యాణ్ వచ్చినపుడు ఆలయంలో వసతి సముదాయం, దీక్షా మండపం అవసరాన్ని ఆలయ అధికారులు, పండితులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వస్తున్న భక్తులు, ఆంజనేయస్వామి మాల ధరించి వస్తున్న స్వాములు పడుతున్న ఇబ్బందులను చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ ధార్మిక మండపాల నిర్మాణాల నిమిత్తం వెచ్చిస్తున్న నిధుల నుంచి రూ.35.19 కోట్లను కొండగట్టు ఆలయంలో సత్రం, దీక్షల విరమణ మండపాలను నిర్మించేలా కేటాయించింది. ఈ నిధులతో మొత్తం 96 గదుల వసతి సముదాయం, 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా అతిపెద్ద మండపం అందుబాటులోకి రానున్నాయి.

ఈ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన(Foundation Stone Laying) చేశారు. అంతకుముందు వేదపండితులు శాస్త్రోక్తంగా ఆయనకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కొండగట్టు స్థానం ఎంత శక్తిమంతమైందంటే తెలంగాణకు పూర్తి స్థాయి రక్షణ, బలంగా మారుతుందని పేర్కొన్నారు. ‘కొండగట్టు గిరిప్రదక్షిణకు ప్రయత్నం మొదలుపెట్టండి. నేను స్వయంగా వచ్చి కరసేవ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటా. అంతా సమష్టిగా స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి’ అని సూచించారు.

‘చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2008 నుంచి నాకు తెలుసు. ఉస్మానియాలో ఎన్ఎస్‌యూ నాయకుడిగా ఉన్నపుడు నాతోపాటు కలిసి పనిచేసేవారు. తెలంగాణ ప్రజలు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు పునర్జన్మనిచ్చిన కొండగట్టు అంజన్నస్వామి వారి దివ్యానుగ్రహానికి ప్రత్యక్ష సాక్షి సత్యం. నేను గతంలో కొండగట్టు సందర్శించినపుడు అర్చకులు అప్పట్లో సత్రం కావాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉంది. ఈ అభివృద్ధి పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఏపీ శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, టీటీడీ బోర్టు మెంబర్లు ఆనందసాయి, మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్ఏసీ ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News