Monday, March 2, 2026
HomeతెలంగాణKCR | కేసీఆర్ వస్తారా?

KCR | కేసీఆర్ వస్తారా?

ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతారా?
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
నీళ్ల రాద్ధాంతం వెనక అసలు రాజకీయం ఏంటి?
ఇది గులాబీ నేతల వ్యూహమా? తప్పించుకునే ప్రయత్నమా?
సభకు రావాల్సిందేనని పట్టుబడుతున్న నేతలకు కేసీఆర్ ఏం చెబుతారు?
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అధికార/ప్రతిపక్ష పార్టీలో పైచేయి ఎవరిది?

హైదరాబాద్, డిసెంబర్ 28 (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు(Telangana Assembly Meetings) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నేటి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత కేసీఆర్ నీళ్ల రాద్ధాంతానికి(Water Dispute) తెరలేపారు. దీంతో.. ఈసారి సెషన్ పూర్తిగా భిన్నంగా సాగుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఒక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మరో వైపు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల వ్యవహారం, ఇంకో వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case), కృష్ణా నదీ జలాల పంపకం, ఫార్ములా ఇ-కార్ రేస్ వ్యవహారం.. ఇలా అనేక కీలక అంశాలు సభలో చర్చకు వచ్చి ప్రతిపక్షాలను ఇరుకునపెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చర్చల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే గులాబీ నేత కేసీఆర్ నీళ్ల రాద్ధాంతాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

కేసీఆర్‌ కేంద్రంగా అధికార పార్టీ వ్యూహాలు

ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ ఆరోపణలను తిప్పికొట్టాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న చర్యలపై కేసీఆర్‌ను నేరుగా ఇరకాటంలో పెట్టేలా చర్చను మలచాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు కృష్ణా–గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తెలంగాణకు నదీ జలాల వాటాల్లో అన్యాయం జరగడానికి కేసీఆరే కారణమని లెక్కలతో సహా సభలో ఎక్స్‌పోజ్ చేయాలన్న దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగం పెంచినట్టు సమాచారం. ఈ క్రమంలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటిపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కటిగా తిప్పికొట్టి ఎక్కడికక్కడ ఘాటుగా ఎండగట్టాలని మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

2024 బడ్జెట్ సెషన్‌కు హాజరై కొద్దిసేపే ఉన్న కేసీఆర్

నిజానికి ఈసారి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదా అన్న అంశంపై ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయినా.. మొన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరవుతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి గులాబీ బాస్ రెగ్యులర్‌గా శాసన సభ సమావేశాలకు హాజరుకావడం లేదు. 2023 డిసెంబర్‌ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన రోజే మాజీ సీఎం కేసీఆర్ బాత్‌రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముకకు ఫ్యాక్చర్ అయింది. సర్జరీ అనంతరం కొంత కాలం విశ్రాంతి తీసుకున్న ఆయన.. అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 2024లో జరిగిన బడ్జెట్ సెషన్‌కు హాజరై కొద్దిసేపు ఉండి వెంటనే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున సభకు వచ్చారు. అయితే అనంతరం జరిగిన శాసన సభ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనలేదు. ఏ కీలక చర్చలోనూ ఆయన కనిపించలేదు. ఇక ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందేనని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు కృష్ణా నదీ జలాలపై కీలక చర్చ జరగనున్న ఈ సమయంలో.. అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఈసారి సభ వేరే లెవల్‌లో ఉంటుందని గులాబీ నేతలు ఆశపడుతున్నారు. ముఖ్యంగా నీళ్ల అంశాలపై కేసీఆర్ మాట్లాడితేనే ప్రభుత్వ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వొచ్చని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో సభకు గైర్హాజరైతే.. అధికార పార్టీకి విమర్శలకు మరింత అవకాశం దొరికే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల పేరుతో మొదలైన ఈ రాజకీయ రాద్ధాంతం చివరికి ఎవరి వ్యూహం ఫలిస్తుందో.. ఎవరి మౌనం ఎక్కువగా మాట్లాడుతుందో.. అనేది ఈ అసెంబ్లీ సమావేశాలే తేల్చనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News