మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా
కొడంగల్(Kodangal)లో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR)లపై సీఎం రేవంత్ (CM Revanth) చేసిన తీవ్ర వాఖ్యలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఖండించారు. రేవంత్ వ్యాఖ్యలు ఆయనలోని నిరాశ, నిస్పృహ, భయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 4 వేల పైచిలుకు మంది బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అభ్యర్థులను గెలిపించడంతో రేవంత్‌కి మైండ్ బ్లాకై(Mind Block) పిచ్చి వాగుడు వాగుతున్నాడని మండిపడ్డారు. చెప్పుకోవడానికి చేసినవేమీ లేకనే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని దుయ్యబట్టారు.
‘ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు.. కేసీఆర్ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. నీదే పేడమూతి. నువ్వే బోడి లింగం. నీ నెత్తిలో మొత్తం పెండ ఉంది. కాబట్టి నీ పేడమూతితో బోడి లింగం మాటలు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి చేసే శపథాలు, దేవుడి మీద పెట్టే ఒట్లు రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో దేవుళ్లందరి మీద వేసినపుడే తెలంగాణ ప్రజలందరూ గమనించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల చేతిలో భంగపాటు తప్పదు. రేవంత్ రెడ్డి ఈ రోజు కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్‌లపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ స్థాయి లేని, నిరాశతో చేసిన మాటలు. పదేళ్ల బీఆరెస్ పాలనపై ఆరోపణలు చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, సాగు నీరు, సంక్షేమం, మౌలిక వసతుల్లో దేశానికే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ పాలనపై మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదు.
పాలమూరు ప్రాంతాన్ని పడావు పెట్టారన్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులు బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే సింహాభాగం పూర్తయ్యాయి. వాస్తవాలు తెలియక ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సీఎం స్థాయికి తగదు. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు కాంగ్రెస్ పాలనలో సాగునీటి పరిస్థితి ఏంటో ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఏర్పడక ముందు పాలమూరు ప్రాంత ప్రజలు పడిన కష్టాలు, వలసల బాధ్యత కాంగ్రెస్‌దే. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దిగజారుతనానికి పరాకాష్ట.
అభివృద్ధి, పరిపాలనపై మాట్లాడే ధైర్యం లేకే ఇలాంటి స్థాయి లేని విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి శపథం, ఒట్లకు విలువ లేదు అని రూ.2 లక్షల రుణమాఫీ అప్పుడు తెలంగాణ దేవుళ్లపై రేవంత్ రెడ్డి చేసిన ఒట్ల విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. బీఆరెస్ నాయకత్వాన్ని, కేసీఆర్‌ను బెదిరింపులతో భయపెట్టగలమని అనుకోవడం భ్రమ. సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 4 వేల పైచిలుకు మంది BRS పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో మైండ్ బ్లాకై పిచ్చి వాగుడు వాగుతున్నాడు.
ఇలా పిచ్చి మాటలు మాట్లాడే వాడినా సీఎంగా ఎన్నుకున్నామని తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు బండకేసి కొడదామా అని తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా చర్చకు సిద్ధమైతే అసెంబ్లీలో వాస్తవాలతో మాట్లాడాలి.
వ్యక్తిగత దూషణలు, బెదిరింపుల భాష మానుకోవాలి. ప్రతిపక్ష సభ్యులకు మైక్ కట్ చేయకుండా తగినంత సమయం ఇవ్వాలి. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో చర్చించి తేల్చుకుందాం. ప్రజలు అన్నీ చూస్తున్నారు. చరిత్ర అన్నింటినీ గుర్తుంచుకుంటుంది. మీకు రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదు’ అని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
